‘పొన్నియన్ సెల్వన్ 1’ మూవీ రివ్యూ
- September 30, 2022
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, జయరామ్ తదితరులు.
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
సంగీతం: ఎ.ఆర్ రెహమాన్
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం
పదో శతాబ్ధం నాటి చోళ సామ్రాజ్యంలో జరిగిన కుట్రలూ, కుతంత్రాల నేపథ్యంలో విజువల్ డైరెక్టర్‌గా పేరొందిన మణిరత్నం తెరకెక్కించిన విజువల్ వండర్‌గా ‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమా తెరకెక్కింది. చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సాగిన చోళ సామ్రాజ్య చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంది. ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించారు మణిరత్నం. భారీ బడ్జెట్ మరియు, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి పార్ట్ ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
చోళ రాజ్యానికి అధిపతి సుందర చోళుని కథ ఇది. ఆయన చరమాంకంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కుట్రలు, కుతంత్రాలూ, రాజకీయ తంత్రాల నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘పొన్నియన్ సెల్వన్ 1’.
సుందర చోళుడు (ప్రకాష్ రాజ్), ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) చిన్న కుమారుడు అరున్ మొళి (జయం రవి). ఈయననే రాజ్యంలో పొన్నియన్ సెల్వన్ అని పిలుస్తుంటారు. సుందర చోళుని కుమార్తై కుందవై (త్రిష). రాజనీతి తెలిసిన యువరాణి. చోళ సామ్రాజ్యాన్ని ఎలాగైనా నాశనం చేయాలని పగతో రగిలిపోతుంటుంది నందిని (ఐశ్వర్యా రాయ్). ఆదిత్య కరికాలన్‌కి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు వందియ దేవన్ (కార్తి). యువరాజులు రాజ్యంలో లేని సమయం చూసి, రాజ్యాన్ని వేరొకరికి అప్పగించేందుకు కుట్రలు చేస్తుంటాడు పలు వేట్లై రాజు (శరత్ కుమార్). ఆ సమయంలో తండ్రికీ, సోదరికీ తోడుగా వుండమనీ, రాజ్యంలో జరుగుతున్న కుట్రలను కనిపెట్టమనీ, వందియ దేవన్‌ని పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. అలాగే, రాజ్య కుట్రను గమనించిన వందియ దేవన్ ఏం చేస్తాడు.? ఈ క్రమంలో కుందవై, వందియ దేవన్‌కి చెప్పిన రహస్యమేంటీ.? వందియ దేవన్ సహాయంతో యువరాజులిద్దరూ ఎలా తమ రాజ్యాన్ని కుట్రల నుంచి కాపాడుకుంటారు.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది.? మహా నటుడు. ఆదిత్య కరికాలన్‌గా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అలాగే జయం రవికి ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత గల పాత్ర దక్కింది. ఇక కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్యాన్ని కుట్రల నుంచి కాపాడి, తనను నమ్మిన స్నేహితుడికి వెన్నుదన్నుగా వుండే పాత్ర కార్తిది. నిజానికి సినిమా మొత్తం కార్తి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రతోనే కథ మొదలవుతుంది. ఈ పాత్రతోనే ఎండ్ అవుతుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే కార్తి, వందియ దేవన్ పాత్రలోనూ అలవోకగా నటించేశాడు. అత్యంత తెలివైన, రాజనీతి తెలిసిన యువరాణి పాత్రలో త్రిష ఒదిగిపోయింది. నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర నందినిగా ఐశ్వర్య రాయ్ తన వంతు న్యాయం చేసింది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఐశ్వర్య రాయ్ కనిపిస్తుంది. వయసు మళ్లిన పాత్రలో సుందర చోళుడిగా ప్రకాష్ రాజ్ ప్రాణం పెట్టేశాడు. శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్యా లక్ష్మి తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
విజువల్ వండర్ అని ముందే చెప్పుకున్నాం కదా. అందుకు తగ్గట్లుగానే వండర్ ఫుల్ విజువల్స్‌తో కట్టిపడేశాడు. మణిరత్నం తన ముప్పై ఏళ్ల కలగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. కానీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే తదితర అంశాల్లో కొన్ని కొన్ని లోపాలున్నప్పటికీ, అబ్బుర పరిచే విజువల్స్‌తో ఆ లోపాలను ఎత్తి చూపే అవకాశం లేకుండా చేసేశారు. పాటలు వినడం కన్నా, చూసేందుకు చాలా చాలా బాగున్నాయ్. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టేందుకు లేదు. సినిమాటోగ్రఫీ ప్రతీ ప్రేమ్‌లోనూ వావ్ అనిపిస్తుంది. మాటలు బాగున్నాయ్. ఎడిటింగ్ విషయంలోనూ కాస్త ల్యాగ్ ఎక్కువైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అయితే, విజువల్స్ ఆ లోపాన్నీ పక్కకు నెట్టేస్తుంది.
ప్లస్ పాయింట్స్
మెస్మరైజ్ చేసే విజువల్స్..
నటీ నటులందరి పర్‌ఫామెన్స్..
డైరెక్టర్ మేకింగ్ అండ్ టేకింగ్ వేల్యూస్..
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా కాస్త బోరింగ్ అనిపించే ల్యాగ్ సన్నివేశాలు..
కొత్తదనం లేని యాక్షన్ సన్నివేశాలు..
చివరిగా:
‘పొన్నియన్ సెల్వన్ 1’ ఓ విజువల్ వండర్. ధియేటర్లో చూడదగ్గదే.!
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!