సీడీఎస్‌గా అనిల్ చౌహాన్ బాధ్యతలు స్వీకరణ..

- September 30, 2022 , by Maagulf
సీడీఎస్‌గా అనిల్ చౌహాన్ బాధ్యతలు స్వీకరణ..

న్యూ ఢిల్లీ: భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్ అనిల్‌ చౌహాన్ శుక్రవారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. భారత రెండ‌వ సీడీఎస్‌గా కేంద్ర ప్ర‌భుత్వం అనిల్ చౌహాన్‌ను ఇటీవల నియ‌మించిన విష‌యం తెలిసిందే. బాధ్యతల స్వీకరణకు సతీమణి అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి చౌహాన్ సీడీఎస్ ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆయ‌న‌కు గౌర‌వ వంద‌నం ల‌భించింది. అంతకుముందు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి చౌహాన్ నివాళులర్పించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం చౌహాన్ మాట్లాడుతూ.. భార‌త సైనిక ద‌ళాల్లో అత్య‌ధిక ర్యాంకు ద‌క్క‌డం గ‌ర్వంగా ఉంద‌ని అనిల్ అన్నారు. త్రివిధ ద‌ళాల ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు సీడీఎస్ అనిల్ చెప్పారు. అన్ని స‌వాళ్ల‌ను, అవ‌రోధాల‌ను క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన సౌత్ బ్లాక్ కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలాఉంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత త్రీ స్టార్ లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ అధికారి పదవీ విరమణ తర్వాత ఫోర్ స్టార్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

గత ఏడాది మేలో ఈస్టర్న్‌ కమాండర్‌గా పదవీ విరమణ చేసిన లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌కు 61ఏళ్లు. నాలబై ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు.. అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్‌ వ్యవహరిస్తారని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com