కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన బయ్యారం దోషులు!

- September 30, 2022 , by Maagulf
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన బయ్యారం దోషులు!

న్యూఢిల్లీ: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అసలైన దోషులని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అబద్ధాలతో, మోసపూరిత వాగ్ధానాలతో తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. 

శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పి.. నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీ నివేదిక ప్రకారం అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పలుమార్లు వెల్లడించాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 
‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టంలో పేర్కొన్నట్లుగానే స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ పలుమార్లు పరిశీలించిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇదంతా రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోపే జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ 2014 నవంబర్ లో ఫీజిబిలిటీ నివేదికను అందించింది’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా 2018 మార్చి 7వ తేదీన రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత పార్లమెంటులోనూ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇదే సమాధానాన్ని ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2018లో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఈ కమిటీ ని సమీక్షించారు. ఆ కమిటీ కూడా బయ్యారంలో లభించే ఐరన్ ఓర్ నాణ్యమైనది కాదని చెప్పింది’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఇంత జరిగినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అర్థరహితమైన విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకోవడంతోపాటు, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీపై బురదజల్లుతోందన్నారు. ఇలాంటి డొల్లమాటల వలలో పడొద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని ప్రజలను కిషన్ రెడ్డి కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘కేంద్రం కట్టకపోతే మేమే బయ్యారం ఫ్యాక్టరీని కడతాం’ అని పలికిన ప్రగల్భాలను తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకున్నారన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కట్టి తీరతాం. సింగరేణి, టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో బయ్యారం ఫ్యాక్టరీని నిర్మిస్తాం. 10 నుంచి 15వేల మందికి ఉపాధి కల్పిస్తాం. దీనికోసం దీక్షలు చేయాల్సిన పని మాకు లేదు’ అని కేటీఆర్ మీడియా సమక్షంలో చెప్పిన వీడియోను కిషన్ రెడ్డి, స్క్రీన్ పై చూపించారు. 
కేంద్రం మీద ఆరోపణలు చేయడం మానుకుని, చేతనైతే, దమ్ముంటే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని కట్టాలని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. అంతే తప్ప, తప్పుడు ఆరోపణలు చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మీరు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోతారా? అని ముఖ్యమంత్రి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. ‘ఇది తెలంగాణ ప్రజలందరి అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఉత్తర కుమార ప్రగల్భాలను అర్థం చేసుకుంటున్నారు. ఇంకా మీ నాటకాలను కప్పిపెట్టండి. ప్రజలు మిమ్మల్ని మరింతగా ఛీత్కరించుకునేలా వ్యవహరించకండి’ అని కిషన్ రెడ్డి హితబోధ చేశారు.
అసలు టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి బయ్యారం ఫ్యాక్టరీపై ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయిందని, పాలన అస్తవ్యస్తమైందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. భూ, ఇసుక, మద్యం మాఫియా పెట్రేగిపోతోందని ప్రభుత్వం వీటిని నియంత్రించడం మాని కేంద్రంపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సమస్యలు పరిష్కరించాలంటూ దాదాపు 4 లక్షల దరఖాస్తులు వస్తే ఒక్కటంటే ఒక్క కేసును కూడా కేంద్రం పరిష్కరించలేకపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోడు భూముల విషయంలో పెద్ద పెద్ద  మాటలు చెప్పి.. తమకు న్యాయం చేయమన్న రైతులపై లాఠీలు ఝుళిపిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారన్నారు. వందశాతం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అడ్డంకులు సృష్టిస్తోందని, ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ విషయంలో సహకరించడం లేదన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో దీనమైన పరిస్థితిలో ఉంటే వాటన్నింటినీ పక్కనపెట్టి సొంత లాభం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసిన తర్వాత జాతీయ పార్టీ ఆలోచన చేస్తే బాగుంటుందని టీఆర్ఎస్ కు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com