అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2022 ప్రారంభం

- October 13, 2022 , by Maagulf
అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2022 ప్రారంభం

రియాద్: రియాద్ సీజన్ 2022 అక్టోబర్ 21న ప్రారంభించనున్నట్లు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కెనడియన్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం సిర్క్యూ డు సోలైల్‌చే అంతర్జాతీయ కచేరీ, సర్కస్ షో "బియాండ్ ఇమాజినేషన్" ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. మొత్తం 65 రోజుల పాటు రియాద్ సీజన్ లో ప్రతిరోజు ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు అల్-షేక్ తెలిపారు. కొత్త సీజన్ కార్యకలాపాలు 15 జోన్లలో జరుగుతాయని.. వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన కార్యక్రమాలను కలిగి ఉన్నాయని అల్-షేక్ వివరించారు. జోన్‌లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, గ్రీస్, ఇండియా, చైనా, స్పెయిన్, జపాన్, మొరాకో, ఇటలీ, మెక్సికో వంటి ప్రపంచంలోని అనేక దేశాల సంస్కృతులు, వంటకాలను ఒకచోట చేర్చే 'బౌలెవార్డ్ వరల్డ్' అత్యంత ప్రముఖమైనదన్నారు. రియాద్ సీజన్ 2022 మొదటిసారిగా 'బౌలెవార్డ్ వరల్డ్' జోన్‌ను ప్రారంభిస్తుందని, ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ సందర్శకులు మొదటిసారిగా ఎడారి నడిబొడ్డున జలాంతర్గాముల్లో ప్రయాణించవచ్చన్నారు. ఈ సీజన్ లో 'రియాద్ జంతుప్రదర్శనశాల'ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 190 జాతులకు చెందిన 1,300 కంటే ఎక్కువ జంతువులు ఉన్నాయన్నారు. ఇంకా 'ఫ్యాన్ ఫెస్టివల్', ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనాపై ప్రత్యేక ప్రదర్శన, రియాద్ ఇమాజినేషన్ పార్క్, WWE రెజ్లింగ్ ఈవెంట్, సువైదీ పార్క్, Zel హెరిటేజ్ మార్కెట్ తదితర అంశాలు సందర్శకులకు కొత్త అనుభూతి ఇస్తుందన్నారు.  సౌదీ అరేబియా పర్యాటక రంగాన్ని పెంచే లక్ష్యంతో రియాద్ సీజన్ 2022 తన కార్యక్రమాలను రూపొందించిందని అల్-షేక్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com