'శ్రీ సాంస్కృతిక కళాసారధి' ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

- October 16, 2022 , by Maagulf
\'శ్రీ సాంస్కృతిక కళాసారధి\' ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

సింగపూర్: ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, సువిశాల దృక్పథం, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.ప్రస్తుతం మలేసియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, ఈరోజు సింగపూర్ లో తెలుగు కళలు, సంస్కృతిని కాపాడుకుని ముందు తరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారధి ద్వితీయ వార్షికోత్సవంలో ప్రసంగించారు.సంస్థ ఆశయం అభినందించదగినదన్న ఆయన, దేశపు ఎల్లలు దాటి పరాయి దేశంలో మన భాష, సంస్కృతి, కళలు గౌరవాన్ని అందుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. గత రెండేళ్ళ కాలంలో సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు.

ప్రపంచానికి నాగరికత నేర్పిన వేదభూమి భారతదేశమన్న వెంకయ్యనాయుడు, వసుధైవ కుటుంబ భావనతో అన్ని దేశాలతో శాంతి, సోదర భావం కోరుకున్న దేశం మనదని పేర్కొన్నారు. చరిత్రలో యుద్ధాల్లో భారతీయులు సాధించిన విజయాలు తప్ప, భారతీయులు ఇతర దేశాల మీదకు దండెత్తిన సందర్భాలు మచ్చుకు కనిపించవని, బలంగా ప్రతిఘటించడమే తప్ప, బలాన్ని చూపించేందుకు కవ్వించే సంస్కృతి భారతదేశానికి లేదని తెలిపారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న భారతదేశంలో బ్రిటీష్ వారు ప్రవేశించిన కారణంగా, మన ఘనమైన గతంలో కొంత భాగాన్ని భారతీయులు కోల్పోవలసి వచ్చిందని, ఈ విషయాన్ని గుర్తించి మనదైన సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింపజేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రపంచంలోని భారతీయులంతా ఏకం కావాలని సూచించారు.

ప్రతి సమస్యకు ఎదురొడ్డి పోరాడిన భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలకు ప్రేరణగా నిలిచిందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, లింగ,భాష, మత, వర్గ, జాతీయత లాంటి వ్యత్యాలకు అతీతంగా నడుచుకునే వ్యక్తిత్వమే కలసికట్టుగా జీవించేందుకు పునాది వేస్తుందని, వీటిలో వైవిధ్యాన్ని ఆహ్వానించే భారతీయుల ఆలోచనా సరళి ఆదర్శనీయమని తెలిపారు. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడగలిగే భారతీయ దృక్పథం, అహింసకు పునాదిగా నిలుస్తుందని, మన ప్రార్థనల్లో ప్రతి చోట శాంతికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సంస్కృతి అంటే పూజలు, పునస్కారాలు కాదన్న వెంకయ్యనాయుడు, పెద్దలను గౌరవించటం, స్త్రీలను గౌరవించటం మన సంస్కృతిలో భాగమని తెలిపారు. సత్ప్రవర్తన, కార్యదీక్ష, స్నేహశీలత వంటివి మన ముందు తరాల నుంచి వారసత్వంగా మనకు అందాయన్న ఆయన, దయ, ఓర్పు, పరోపకారం, ధర్మ నిష్ట, శాంతి, ప్రేమ, అహింస వంటి ఎన్నో ఉత్తమ గుణాల గురించి మన పురాణాలు, ఇతిహాసాలు సమగ్రంగా చర్చించాయని, ఎందరో మహనీయుల కథలను మనకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

మహోన్నత సంస్కృతికి వారసులం అన్ని చెప్పుకోవటం మాత్రమే గొప్ప విషయం కాదన్న  ముప్పవరపు వెంకయ్యనాయుడు, దాన్ని ఆచరణలో చూపినప్పుడే నిజమైన సార్ధకత ఏర్పడుతుందని పేర్కొన్నారు.మన భాష, సంస్కృతులను కాపాడుకుని ముందు తరాలకు అందించటమే మనం ఇచ్చే నిజమైన గౌరవమన్న అయన, ఉన్నతమైన సంస్కృతి ద్వారా ఉన్నతమైన సమాజానికి బాటలు పడతాయని తెలిపారు. ‘పురోభివృద్ధిని కోరుకునేవారు.. పూర్వ వృత్తాన్ని మరువకూడదు’ అన్న సూక్తిని ఉదహరించిన ఆయన,  స్వధర్మం.. మన సంస్కృతికి దూరం కాకూడదని ఆకాంక్షించారు. 

మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, నలుగురి ఆలోచనల సంగమం గొప్ప విజయాలను అందిస్తాయని పేర్కొన్నారు.ఈ దిశగా శ్రీ సాంస్కృతిక కళాసారధి లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించిన ఆయన, యువతలో ఈ చొరవ మరింత పెరగాలని ఆకాంక్షించారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com