జగన్‌ పై నారా లోకేశ్ ఆగ్రహం

- November 02, 2022 , by Maagulf
జగన్‌ పై నారా లోకేశ్ ఆగ్రహం

అమరావతి: కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ చక్రాల కుర్చీకే పరిమితమైన తన కుమార్తెను ఆదుకోవాలని సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చి, ఆ ప్రయత్నం ఫలించక ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే.

అయితే దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఇంటి ముందే న్యాయం కోసం ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని పేర్కొన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైఎస్‌ఆర్‌సిపి నేతల అరాచకాలు కనపడవు అని విమర్శించారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని నారా లోకేశ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లని అరెస్టు చేయాలని పేర్కొన్నారు.

కాగా, వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు చికిత్స కోసం రూ.2 కోట్లు కావాల్సి ఉండగా, తన ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఇద్దరు పోలీసు సిబ్బంది అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిలో ఒకరు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ అని తెలిపారు. అమరావతిలో సీఎంను కలిసేందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆమె బ్లేడుతో మణికట్టు కోసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com