ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో..

- November 17, 2022 , by Maagulf
ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో..

ట్విట్టర్ సంస్థను ఇటీవలే సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ ఇప్పుడు ఈ సంస్థ పూర్తి బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలగబోతున్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక సీఈవోగానే ఉన్నానని, త్వరలోనే కొత్త సీఈవోను నియమిస్తానని మస్క్ చెప్పాడు.

తాను కొంతకాలం మాత్రమే ఈ కంపెనీ బాధ్యతలు చూస్తానని, ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగదలచుకోలేదని స్పష్టం చేశాడు. టెస్లా సంస్థకు సంబంధించి సీఈవోగా ఉన్నందుకు ఎలన్ మస్క్‌కు ఆ సంస్థ 2018లో 56 బిలియన్ డాలర్లు ప్యాకేజీగా చెల్లించింది. దీన్ని సవాలు చేస్తూ ఈ కంపెనీలో షేర్ హోల్డర్ అయిన రిచర్డ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఎలన్ మస్క్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను సీఈవోగా కొన్ని బాధ్యతలకే పరిమితం కాలేదని, కంపెనీని విజయపథంలో నడిపించేందుకు అనేక రకాలుగా కృషి చేశానని, అందువల్లే కంపెనీ తనకు అంతమొత్తంలో చెల్లించిందని మస్క్ కోర్టుకు తెలిపాడు. అలాగే ట్విట్టర్ సీఈవోగా కొనసాగడంపై కూడా స్పందించాడు. ‘‘ట్విట్టర్ సంస్థను పూర్తి విజయపథంలో నిలిపేంతవరకు కంపెనీ సీఈవోగా కొనసాగుతాను.

ఆ తర్వాత వేరే వాళ్లను నియమిస్తాను. నాకు సీఈవోగా కొనసాగాలని అంతగా ఆసక్తి లేదు. ఈ విషయంలో నాకు టెస్లా ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు’’ అని మస్క్ కోర్టులో తెలిపాడు. మరోవైపు ట్విట్టర్ సంస్థలో మస్క్ తీసుకొస్తున్న మార్పులు అనేక సంచలనాలకు కారణమవుతున్నాయి. ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగించడంతోపాటు, బ్లూటిక్ సర్వీస్‌కు డబ్బులు వసూలు చేయడం వంటి వాటిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com