తమిళనాడులో ప్రబలుతున్న ‘మద్రాస్ ఐ’..

- November 21, 2022 , by Maagulf
తమిళనాడులో ప్రబలుతున్న ‘మద్రాస్ ఐ’..

చెన్నై: కరోనా నుంచి బయటపడుతున్న వేళ.. తమిళనాడు ప్రజలకు ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అక్కడి ప్రజలను ‘మద్రాస్ ఐ’ (కండ్ల కలక) వణికిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారం నుంచి తమిళనాడులో ‘మద్రాస్ ఐ’ విజృంభిస్తోంది. కంటి వాపు, ఎరుపు, కంట్లోంచి నీరు కారడం ‘మద్రాస్ ఐ’ లక్షణాలు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇది సోకితే మిగతా వారు నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తమిళనాడు మంత్రి సుబ్రహ్మణ్యం అన్నారు.

ముఖ్యంగా మధురైలో ‘మద్రాస్ ఐ’ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వర్షాకాలంలో నగరంలో వానలు భారీగా కురియడంతో ఇది ప్రబలుతున్నట్లు తెలుస్తోంది. మధురైలోని ఒక్క ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలోనే ప్రస్తుతం దాదాపు 30 మంది దీనికి చికిత్స తీసుకుంటున్నారు. చిన్నారులను కూడా ఇది సోకే అవకాశం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్క వారంలో ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలోనే 110కి పైగా ‘మద్రాస్ ఐ’ కేసులు వచ్చాయని చెప్పారు.

ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది. అయితే, దీని గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదని మూడు నుంచి ఐదు రోజుల్లో ‘మద్రాస్ ఐ’ లక్షణాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. చెన్నైలోనూ ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రజలను ఇప్పటికే దీనిపై అప్రమత్తం చేసింది. ప్రతి ఏడాది వానాకాలం ముగిసే సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుంది. చెన్నైలో ప్రస్తుతం 20 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com