వంద చిత్రాలు పూర్తి చేసుకున్న హీరోల కథనం..
- April 23, 2016
హీరోగా వంద సినిమాలు. ఇదేమీ చిన్నా చితకా ఫీట్ కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం కూడా కాదు. శతాబ్దాల పాటు హీరోగా నిలబడగలిగితేనే.. శతచిత్ర హీరో అనిపించుకునే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో ఈ రికార్డును అందుకున్న వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. వీళ్లంతా ఆ తరంలో రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి వంద చిత్రాలకన్నా ఎక్కువగానే చేసేసారు. ఆ తరువాత తరం హీరోల్లో చిరంజీవి వందో సినిమా ఎప్పుడో పూర్తి చేసేసాడు. ఇక ఇప్పుడు బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తో వందో చిత్రాన్ని కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న హీరోలపై ప్రత్యేక కథనం.. ఈ తరం హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ లెక్కన వంద పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కానీ తెలుగు సినిమా స్వర్ణయుగంలో మహామహులైన హీరోలంతా సంవత్సరానికి సగటున పది సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను వేగంగా పరిగెట్టించేవారు. రోజుకు మూడు ఫిఫ్టులు పనిచేస్తూ.. ఏ సినిమా షూటింగ్ లో ఉన్నారో కూడా తెలియకుండా నటించేవారు.
ఎన్టీఆర్... యన్టీఆర్, ఎఎన్నార్ లాంటి అగ్రహీరోలు ఆ రోజుల్లో పోటీ పడుతూ మరీ తమ సినిమాల సంఖ్యపెంచుకుంటూ పోయేవారు. ఇప్పుడైతే వందో సినిమాను ప్రత్యేకంగా చేస్తున్నారు కానీ. వీరిద్దరికి అప్పట్లో తమ వందో సినిమా ఏదో, ఎవరో ఒకరు గుర్తు చేసేవరకూ తెలియదు. చిన్న వయసులోనే ఈ ఇద్దరు హీరోలు వంద సినిమాల మార్క్ ను దాటుకుంటూ ముందుకు దూసుకుపోయారు. లెక్కకు మించిన సినిమాలు చేయడం వల్ల ఏ సినిమా ఎన్నోదనే ఆలోచన అప్పట్లో రాలేదు ఈ హీరోలిద్దరికీ. ఆ తీరికకూడా ఉండేది కాదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం యన్టీఆర్ తో వృత్తి పరంగా పోటీపడడం వల్ల తన వందో సినిమాను ప్రత్యేకంగా తన స్వయంగా నిర్మించుకొన్నారు. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమకి యన్టీఆర్ వరపుత్రుడు. ఆయన రాకతోనే మన తెలుగు తెరకు అద్భుతమైన శోభ చేకూరింది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలతో తెలుగు వారి వేల్పుగా తారకరాముడు కొలువైయుండి పోయాడు. దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించి ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిండిపోయున్నాడు.వందో సినిమా నర్తన శాల.. 1949 లో మనదేశం చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన యన్టీఆర్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని తన నటనా వైదుష్యంతో మెప్పించి రక్తి కట్టించారు. పాతాళభైరవి తో స్టార్ డమ్ ను తెచ్చుకున్న ఆయన మాస్ జనానికి ఆరాధ్యనటుడయ్యారు. కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, రావణుడిగా, శివుడిగా. భీష్ముడిగా .. ఇలా ఒకటేంటి.. అన్ని రకాల పౌరాణిక పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. జానపద కథానాయకుడిగా కత్తి తిప్పారు, గుర్రమెక్కారు. చారిత్రక నాయకుడిగా కథం తొక్కారు, సాంఘిక కథానాయకుడిగా అన్ని రకాల పాత్రల్లో జీవించారు. యన్టీఆర్ 44 పౌరాణిక చిత్రాలు, 186 సాంఘిక చిత్రాలు, 55 జానపద చిత్రాలు, 13 చారిత్రకచిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన యన్టీఆర్ , అందులో వందో సినిమాగా నర్తన శాల నిలిచిపోయింది. ఆయనకు ఆ సినిమా వందో సినిమా అని ఎవరో చెబితేనే కానీ తెలియలేకపోవడం విశేషం.అక్కినేని.. యన్టీఆర్ తరువాత శతాధిక చిత్రాల్లో నటించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. దాదాపు 256 చిత్రాల్లో నటించారు అక్కినేని. అక్కినేని సాంఘిక చిత్రాలకు రారాజు. కుటుంబ కథాంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ అక్కినేని ఆ తరం ప్రేక్షకుల్ని వైవిధ్యమైన పాత్రలతో ఉర్రూతలూగించారు. కొన్ని కొన్ని సందర్భాల్లో యన్టీఆర్ తో పోటీ పడుతూ తన సత్తా చాటుకునేవారు. ఎఎన్నార్ లో ఒక్కో అక్షరానికి ఆయన నటజీవితానికి ముడిపెట్టి చెబితే... ఎక్టర్ ఆఫ్ నావలిస్టిక్ అండ్ రొమాంటిక్ రోల్స్ అని అభివర్ణిస్తే బావుంటుందేమో. నవ్య నవలానాయకుడిగా వాటిల్లో కూడా శృంగారాత్మక పాత్రలను అమోఘంగా పోషించి శెభాష్ అనిపించిన నటుడిగా ఎఎన్నార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎస్పెషల్లీ... ప్రేమ భగ్నమై... రెండు వేళ్ల మధ్య నలిగే సిగరెట్టు, మరో చేత్తో మందుగ్లాసు, చుట్టూ పొగలు, మనసులో ప్రేమగుబులు... ఈ తరహా పాత్రలు పోషించడంలో ఎఎన్నార్ కి సపరేటు డిగ్రీలున్నాయి. సాంఘీక కథా చిత్రాల నాయకుడిగా ఆయన విశేష నటన కనబరిచారు. సామాన్య మానవుడికి చెందిన అన్ని కోణాలు దాదాపు ఆయన తెరమీద ఆవిష్కరించి నటనంటే నీదే నాగేశ్వర్రావ్ అనిపించేశాడు. ఏడు దశాబ్దాల సినీ జీవితం కాలంలో ఆయన నటించిన చిత్రాలు 256. అక్కినిని కూడా చాలా చిన్న వయసులోనే వంద చిత్రాలు పూర్తి చేసారు. ఇక్కడ ఓ విశేషమేంటంటే.. ఆయన నటించిన వందో చిత్రం ఓ తమిళ్ సినిమా అవడం. అది కూడా అక్కినేనికి గుర్తులేదు. అలా సినిమా ల సంఖ్య గుర్తించుకోకుండా, అసంఖ్యాకంగా సినిమాలు చేసారు అక్కినేని.శోభన్ బాబు.. యన్టీఆర్ , ఎఎన్నార్ ల తరువాత శతాధిక చిత్రాల్లో నటించిన మరో గొప్ప హీరో సోగ్గాడు శోభన్ బాబు. తెలుగు తెర అందాల నటుడుగా కీర్తి గడించిన శోభన్ బాబు దాదాపు 230 చిత్రాల్లో నటించారు. మహిళల ఆరాధ్య కథానాయకుడైన ఆయన తెలుగు చలనచిత్ర సీమకు చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. తెలుగునాట సినీహీరో శోభన్‌బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్‌లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్‌మన్ కలర్‌కి మారుతూ ఉన్న సంధియుగంలో నాటి యువతరానికి శోభన్‌బాబే ఆదర్శ కథానాయకుడయ్యారు. ఒక సహజ అందగాడుగా, కుటుంబ - ప్రేమకథా చిత్రాల సెంటిమెంటల్ హీరోగా మహిళాప్రేక్షకుల్ని ఆకర్షించగలగడం కూడా ఒక కారణం. అందానికి తగ్గట్టుగా హుందాతనం చెక్కుచెదరకుండా నటించే తన గంభీర మూర్తిమత్త్వం అనేక నవలాధారిత చిత్రాలకి ఆయన్నొక ఆటోమేటిక్ ఎంపికగా మార్చింది. మూడున్నఱ దశాబ్దాల పాటు 230 కి పైగా తెలుగుచిత్రాలలో నటించి "హీరో అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి" అని ప్రజల మనస్సులలో ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిపోయిన నటభూషణుడు శోభన్ బాబు. ఆయన కూడా వంద చిత్రాలను అతి చిన్న వయసులోనే పూర్తి చేసారు. ఇక శోభన్ బాబు వందో సినిమా కన్నవారి కలలు.సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు తెరమీద అతి ఎక్కువ సంఖ్యలో చిత్రాలు చేసిన కథానాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణ నిలిచిపోతారు. ఈ హీరో నుంచే తెలుగు హీరోలు తమ సినిమాల్ని లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టారు. కృష్ణ దాదాపు 330 పైచిలుకు చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఆయన వంద, రెండువందలు, మూడొందల చిత్రాలను ప్రత్యేకంగా తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. కృష్ణ తేనెమనసులు అనే చిత్రంలో నటించి సినీరంగ ప్రవేశం చేసారు. సాహసానికి మారుపేరుగా సూపర్ స్టార్ కృష్ణ ఎందరో తలపెట్టి సాధ్యంకాక వదిలేసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తన వందో చిత్రంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్ని మరీ నిర్మించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓఅద్భుతమైన హిట్‌ను అందించారు. ఎక్కడో ఆంగ్ల సినిమాల్లో మాత్రమే కనిపించే కౌబోయ్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. ఆ తరవాతి కాలంలో మరిన్ని కౌబోయ్ చిత్రాలు వచ్చినా అవేమీ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా మించి ఉండకపోవడం గమనార్హం. నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. ఇక ఆయన రెండు వందలో చిత్రంగా ఈనాడు, మూడు వందలో చిత్రంగా తెలుగు వీర లేవరా తెరకెక్కింది.రెబల్ స్టార్.. తెలుగు తెరమీద వంద సినిమాలకు పైచిలుకు చిత్రాల్లో నటించిన మరో విశిష్టమైన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు., ఆవేశాన్ని, ఉద్రేకాన్ని కలగలిపి అభినయించడం ఆయన స్టైల్. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి అప్పట్లో కృష్ణంరాజు ఎంతగానో ఆకట్టుకునేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా అలాంటి పాత్రల్నే రచయితలు సృష్టించేవారు. తెలుగునాట రెబల్ స్టార్‌గా వెలుగులు విరజిమ్మిన ఘనుడు కృష్ణంరాజు... విలన్ నుండి స్టార్‌గా విజయపథంలో పయనించిన తొలి తెలుగు హీరో కూడా కృష్ణంరాజే. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. నటుడిగా యాభై వసంతాలు చూశారు ... తెలుగునాట ఒకప్పుడు టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకరిగా వెలుగొందారు రెబల్ స్టార్ కృష్ణంరాజు... తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజుది అరుదైన ఘనత... హీరోగా వచ్చి, విలన్ గా మారి, మళ్ళీ హీరోగా విజయం చూసిన ఘనుడాయన... తొలుత 'చిలక-గోరింక' చిత్రంలో హీరోగా అడుగు పెట్టిన కృష్ణంరాజు ఆ సినిమా పరాజయంతో పలుచిత్రాల్లో ప్రతినాయకునిగా నటించారు... ఎలాగైనా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్టు చిత్రసీమనే నమ్ముకొని సాగారు కృష్ణంరాజు... విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా నటించి తనదైన బాణీ పలికించారాయన. దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు వందో చిత్రంగా దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ రౌడీ చరిత్రలో నిలిచిపోతుంది.చిరంజీవి.. ఇక యన్టీఆర్, ఎఎన్నార్ తరం తర్వాత వచ్చిన చిరంజీవి, అతి వేగంగా వెండితెరమీద ఎదిగారు. తన ట్రేడ్ మార్క్ డాన్స్ లతో, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకుల పాలిట మెగాస్టార్ అయిన ఆయన వంద చిత్రాలను అతి వేగంగా పూర్తి చేసారు. నిజానికి తెలుగు తెరకు స్పీడ్ ను పరిచయం చేసిన హీరో చిరంజీవే అంటే అతిశయోక్తి లేదు. పునాది రాళ్ళు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 'మెగాస్టార్' గా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ఎన్టీఆర్, ఎన్నార్, శోభన్ బాబు వంటి మహామహులు వెండితెరపై వెలిగిపోతున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి నటన, డ్యాన్స్, ఫైట్లు, కామెడీ అన్ని విభాగాల్లో పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఎన్టీఆర్ తరువాత తెలుగు ప్రేక్షకుల చేత అన్నయ్య అని పిలిపించుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరమీద నెం.1 హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు చిరంజీవి. 150 వ చిత్రానికి ఒకే ఒక్క సినిమా దూరంలో నిలిచిన ఆయన 1988లో వచ్చిన త్రినేత్రుడు చిత్రంతో 100 సినిమాల్ని కంప్లీట్ చేసుకున్నారు. 1978 లో తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కేవలం పది సంవత్సరాల్లోనే 100చిత్రాల్ని కంప్లీట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆరుపదుల వయసులోకి అడుగుపెట్టిన ఆయన ఇప్పటికీ అదే గ్రేస్ తో డ్యాన్స్ చేస్తుండడం గొప్ప విశేషం. 2007 తర్వాత సినిమాలకు తాత్కాలికంగా స్వస్థిచెప్పిన మెగాస్టార్ 150 వ సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మోహన్ బాబు..శ్రీకాంత్..రాజేంద్రప్రసాద్.. ఇక తెలుగు లో మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ , శ్రీకాంత్ లు ఎప్పుడో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ అభినయంలో తిరుగులేని హీరోలే. గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకుండానే వీరు ముగ్గురూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు తెలుగు తెరమీద డైలాగ్ కింగ్. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ . విలన్ గా అత్యధిక ప్రజాదరణ పొందిన రెండో తరం నటుడు. మోహన్ బాబు దాదాపు 550 పైచిలుకు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. హీరోగా ఎప్పుడో ఆయన వంద మార్క్ ను క్రాస్ అయిపోయారు. నిర్మాతగానే దాదాపు 50 పై చిలుకు చిత్రాల్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్.. 'స్నేహం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, దాదాపు 200కి పైగా చిత్రాల్లోని భిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎంతగా నవ్వించ గలరో.. అదే స్థాయిలోనూ ఎడిపించగలరని ఆయన నటించిన చిత్రాలు చెప్పకనే చెబుతాయి. ఎర్రమందారం', 'ఆ నలుగురు' వంటి చిత్రాల్లోని ఉత్తమ నటనకు రెండు సార్లు ఆంధ్రరాష్ట్ర నంది అవార్డులు ఆయన్ని వరించాయి. లేడీస్ టైలర్, అహనా పెళ్లంట, ఏప్రిల్ 1విడుదల, అప్పుల అప్పారావు ఆయన కెరీర్లో మరిచిపోలేని చిత్రాలు. ఇక శ్రీకాంత్ పీపుల్స్ ఎన్ కౌంటర్ తో తెలుగు లో పరిచయమై, మహాత్మ చిత్రంతో వంద చిత్రాల్ని పూర్తి చేసారు. విలన్ గా, కుటుంబ చిత్రాల నాయకుడిగా, లవర్ బాయ్ గా ఎన్నో మరపురాని చిత్రాలు చేసి శ్రీకాంత్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతునే కేరక్టర్ ఆర్టిస్ట్ గాకూడా తన సత్తా చాటుకుంటున్నాడు శ్రీకాంత్.బాలకృష్ణ.. ఇక చిరంజీవి తరువాత తెలుగు లో వంద సినిమాలు పూర్తి చేయబోతున్న మరో హీరో నందమూరి బాలకృష్ణ. తనదైన డైలాగ్స్ తో , అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా ఆయన తన జోరును కొనసాగిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ తరం అగ్రనటుల్లో నటనలో వాడి, డైలాగ్సలో వేడితో ప్రేక్షకుడిని థియేటర్ వైపు అడుగులు వేయిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు సనీవారసుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమైన బాలకృష్ణ తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకలతో సినిమా రంగ ప్రవేశం చేశారు. తండ్రి ఎన్టీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న నటనా వారసత్వంతో కృష్ణార్జున విజయంలో కృష్ణుడిగా, అర్జునుడిగా, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా, పాండురంగడులో పాండురంగడు వంటి పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటి తరం హీరోల్లో పౌరాణిక, భైరవద్వీపం వంటి జానపదం, ఆదిత్య 369 వంటి సోషియో ఫాంటసీ, చారిత్రక, భక్తిరస, సాంఘిక చిత్రాలు...ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణ. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగు నాట ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలికి సింహా, లెజెండ్ సినిమాలతో తనలో డైలాగ్స్ వాడి, వేడి ఏమాత్రం తగ్గలేదని మరోసారి విమర్శకులకు నిరూపించారు. ఇప్పుడు బాలయ్య వందకి ఒక్క సినిమా దూరంలో ఉన్నారు. గౌతమీ పుత్రశాతకర్ణితో వంద సినిమాల్ని పూర్తి చేయబోతున్నారు. ఇక బాలయ్య తరువాత తెలుగు లో వంద సినిమాలు చేసే హీరోలు గా నాగార్జున, వెంకటేష్ మిగిలి ఉన్నారు. కానీ దానికి ఇంకా కాస్త టైమ్ పడుతుంది. ఇప్పటితరం హీరోలకు వంద సినిమాలు చేసే ఛాన్సేలేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు నేటి కుర్రహీరోలు. ఆ ఫీట్ సాధించాలంటే ఎన్నో సంత్సరాలు ఎదురుచూడాల్సిందే. సో.. తెలుగు లో వంద సినిమాలు పూర్తి చేసిన ఆఖరి హీరోగా వెంకటేష్ నిలిచిపోవచ్చు బహుశా. ఆయన ఇప్పటికి 76 చిత్రాల్లో నటించారు. వంద పూర్తి చేయడం వెంకీకి పెద్ద కష్టమేమీ కాదు. సో.. బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్రలో నిలిచిపోవాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









