జెడ్డాలో కుండపోత వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం.. ఇద్దరు మృతి

- November 25, 2022 , by Maagulf
జెడ్డాలో కుండపోత వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం.. ఇద్దరు మృతి

జెడ్డా: జెడ్డా నగరాన్ని వరదలు అస్తవ్యస్తం చేశాయి. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం ఇలాగే నవంబర్ నెలలో వరదలు నగరాన్ని చుట్టుముట్టి చేదు జ్ఞాపకాలను వదిలివెళ్లాయి. తిరిగి మరోసారి నవంబర్ నెలలోనే జెడ్డా నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం, వరదలను అతలాకుతలం చేసేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన వాహనాల్లో చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించగా.. ఇద్దరు వ్యక్తులు మరణించారు.
జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ప్రకారం.. జెడ్డాలో గురువారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షం మొత్తం 2009లో నమోదైన మొత్తాన్ని మించింది. ఆరు గంటల్లో 179 మిమీ వర్షపాతం నమోదైంది. రోడ్లు, వీధుల నుండి నీరు, వ్యర్థాలను తొలగించడానికి, ట్రాఫిక్ కదలికను పున:ప్రారంభించేందుకు వీలుగా సుమారు 960 యంత్రాలతో కూడిన మొత్తం 2564 మంది పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్నారు.
ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోవడంతో విమానాలు, వాహనాల రాకపోకలకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KAIA) వద్ద కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. హరమైన్ ఎక్స్‌ప్రెస్‌వే, మరికొన్ని ప్రధాన రహదారులు చాలా గంటలపాటు మూసివేశారు. నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లవద్దని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి కల్నల్ ముహమ్మద్ అల్-కర్నీ కోరారు.
శుక్రవారం కూడా జెడ్డాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మక్కా, థువల్, ఇతర తీర ప్రాంతాలతో పాటు జెడ్డా, రబీగ్ గవర్నరేట్‌, ఇతర ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో గాలులు, వడగళ్ళుతోకూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 2009 నవంబర్ 25న జెడ్డాలో వరదల కారణంగా దాదాపు 122 మంది మరణించిన విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com