ఆస్ట్రేలియాలో అవధానార్చన

- November 28, 2022 , by Maagulf
ఆస్ట్రేలియాలో అవధానార్చన

ఆస్ట్రేలియా: తెలుగు‌ సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం , సమయస్ఫూర్తి , ధారణ ఏకకాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్యప్రక్రియ తెలుగుభాషా వైభవానికి నిత్యసాక్ష్యం.

తటవర్తి గురుకులం ద్వారా వివిధదేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఇప్పటిదాకా 55 అవధానాలను ఈ సంవత్సరంలో పూర్తిచేసుకుని ,56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు మూడవ తేదీన ప్రత్యక్షంగా జరుగుతోంది.

తెలుగుభాషను తమ‌ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియా దేశంలో , తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ ,పద్యరచనను నేర్పి నూతన పద్యకవులను తయారుచేస్తూ ఇలా‌ అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం.

 ఆస్ట్రేలియా తెలుగు వారందరూ ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి గారు నిర్వహిస్తున్నారు.

అవధాని , పృచ్ఛకులు , సంచాలకులు అందరూ  మెల్బోర్న్ వారే అవ్వడం , అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ‌ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం.

ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ కార్యక్రమానికి సంచాలకులుగా , ఆస్ట్రేలియా లో‌ ప్రముఖ పద్యకవి డా:వేణుగోపాల్ రాజుపాలెం గారు వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన
సమస్యాపూరణం యామిని చతుర్వేదుల , దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం , నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం , న్యస్తాక్షరి రాజశేఖర్ రావి , ఆశువు రంజిత ఓగిరాల , చిత్రానికి‌పద్యం అర్చన విస్సావజ్ఝుల , అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు.

ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు‌లో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా చేస్తున్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్న ఈ విశిష్ట అవధానార్చన , ప్రవాసతీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com