విల్లా పార్టీలో 28 ఏళ్ల ఎమిరాటి మృతి.. 9 మంది అరెస్ట్

- December 21, 2022 , by Maagulf
విల్లా పార్టీలో 28 ఏళ్ల ఎమిరాటి మృతి.. 9 మంది అరెస్ట్

దుబాయ్‌: దుబాయ్‌లోని అల్ ఖవానీజ్ 2లోని విల్లాలో ఇటీవల జరిగిన పార్టీలో 28 ఏళ్ల ఎమిరాటి కత్తితో పొడిచి చంపబడ్డాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎమిరేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు తొమ్మిది మంది ఎమిరాటీలను విచారిస్తోందన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు స్నేహితులు విల్లా ముందు లాన్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. అకస్మాత్తుగా వారి స్నేహితుల్లో ఒకరు చొక్కా లేకుండా.. రక్తపు మరకలతో తడిసిన ప్యాంటుతో బయటకు వచ్చి తన కారులో ఎక్కి వెళ్లిపోయాడు. కొన్ని సెకన్ల తర్వాత మృతి చెందిన ఎమిరాటి తీవ్ర రక్తస్రావంతో బయటికి వచ్చాడు. పెరట్లో కుప్పకూలి మరణించాడు. ఎమిరాటి మరణాన్ని చూసిన తర్వాత పార్టీలో ఉన్న మరో ఎనిమిది మంది ఎమిరాటీలు అక్కడి నుంచి పారిపోయారు. హాజరుకాని మరో స్నేహితుడు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
కాల్ వచ్చిన వెంటనే దుబాయ్ పోలీసులు సీఐడీ అధికారుల బృందాన్ని అక్కడికి పంపించారు. అయితే పోలీసులు వచ్చేసరికి బాధితుడు మృతి చెందాడు. సాక్ష్యాలను సేకరించి, శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించారు. కేసు విచారణకు పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తొమ్మిది మంది ఎమిరాటీలను అరెస్టు చేశారు. నలుగురిని షార్జాలో గుర్తించగా.. మరో ఐదుగురిని దుబాయ్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com