సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలన్నదే మా ఉద్దేశం: సిఎం జగన్
- December 27, 2022
అమరావతి: రాష్ట్రంలో ఇప్పుడు మనసున్న ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం పాలిస్తోందని సిఎం జగన్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. మూడున్నరేళ్ల పాలనలో ప్రతీ పనీ, ప్రతీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా ఏ ఒక్క అర్హుడు కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు. బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమూ చేసి ఉండదని తెలిపారు. గత జూన్ నుంచి నవంబర్ వరకు 11 సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి, వారికి సంక్షేమ ఫలాలను ఇప్పుడు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 కుటుంబాలకు మొత్తం రూ.591 కోట్లను ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా ఆయా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు.. ఈ మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ క్రెడిట్ విధానంలో నేరుగా ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.1.85 లక్షల కోట్లు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మొత్తానికి నాన్ డీబీసీ విధానంలో అందించిన సొమ్మును కూడా కలిపితే రూ.3.30 లక్షల కోట్లు అని వివరించారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రభుత్వ పెన్షన్ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వచ్చే నెల నుంచి పెన్షన్ సొమ్మును పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే లంచం ఇవ్వక తప్పని పరిస్థితి ఉండేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. లంచాలు, వివక్షలేకుండా ఒక్క పని కూడా జరగలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పెన్షన్ కానీ, మరే ఇతర పథకం డబ్బులైనా అందేవి కాదని విమర్శించారు. ఆ పరిస్థితిని ఈ రోజు చక్కదిద్దామని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తరతమ భేదంలేకుండా అర్హులు అందరికీ అందిస్తున్నామని జగన్ తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







