సీనియర్ నటి జమున కన్నుమూత..

- January 27, 2023 , by Maagulf
సీనియర్ నటి జమున కన్నుమూత..

హైదరాబాద్: టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2022లో కృష్ణ, కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు వరుసగా మరణించి టాలీవుడ్ సినీ పరిశ్రమని శోకసంద్రంలో ముంచేశారు. 2023 లో కూడా ఈ విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరణించగా తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. లాంటి అప్పటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జమున నేడు ఉదయం కన్నుమూశారు.

ప్రస్తుతం తన పిల్లలతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు జమున. గత కొన్నాళ్లుగా వయోభారం సమస్యలతో బాధపడుతున్న జమున 86 ఏళ్ళ వయసులో నేడు శుక్రవారం ఉదయం 7 గంటలకు తన స్వగృహంలో మరణించారు. ఆమె వారసులు ఈ విషయాన్ని మీడియాకి తెలియచేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి తన అందంతో, అభినయంతో మెప్పించారు. రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు కొనసాగారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో సినిమాలకి దూరంగా ఉంటున్నా అప్పుడప్పుడు సినీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిశ్రమకి దగ్గరగానే ఉంటున్నారు జమున.

నేడు ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించనున్నారు. జమున మరణంతో టాలీవుడ్ మరోసారి విషాదంలోకి వెళ్ళింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com