ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్...
- January 29, 2023
ఆస్ట్రేలియా: సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.
ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకు ముందు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా జకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ వరుసగా 28 మ్యాచ్‌లు గెలుపొందడం మరో విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్లలోనూ జకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుస సెట్లు గెలుచుకుంటూ దూసుకెళ్లాడు.
గతంలో కూడా జకోవిచ్ సిట్సిపస్‌పై ఎక్కువ విజయాలు సాధించాడు. జకోవిచ్-సిట్సిపస్ మధ్య విజయాల సంఖ్య 11-2గా ఉంది. చివరిగా 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ సిట్సిపస్‌ను ఓడించాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అనంతరం జకోవిచ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్‌కు సంబంధించి జకోవిచ్ అత్యధిక టైటిల్స్ (10) గెలుచుకున్నాడు. జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 టైటిల్స్ సాధించాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన రాయ్ ఎమర్సన్, రోజర్ ఫెదరర్ తలో ఆరు టైటిల్స్ గెలుచుకుని తర్వాత స్థానాల్లో ఉన్నారు. మెన్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సంబంధించి రఫెల్ నాదల్, జకోవిచ్ చెరో 22 టైటిల్స్ గెలిచారు. ఆ తర్వాత రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, పీట్ సంప్రాస్ 14 టైటిల్స్ గెలుచుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







