నాందేడ్‭తో బీఆర్ఎస్ నేషనల్ ఎంట్రీ..

- February 05, 2023 , by Maagulf
నాందేడ్‭తో బీఆర్ఎస్ నేషనల్ ఎంట్రీ..

మహారాష్ట్ర: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవడం లేదని, అన్ని వనరులు ఉన్నా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేట్ పట్టణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో తామిచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని, తెలంగాణ ప్రగతి దేశంలో అమలు కావాలని కేసీఆర్ అన్నారు. ప్రజలు గులాబీ జెండా ఎత్తుకుంటే ప్రభుత్వాలే ప్రజల కాళ్ల దగ్గరికి వస్తాయని అన్నారు.

‘‘దేశంలో దేనికి తక్కువైంది. అత్యధిక వ్యవసాయ భూమి ఉంది. నీళ్లు కూడా ఉన్నాయి. బొగ్గు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయినా దేశం వెనుకబడి ఉంది. భారత్ పేద దేశమని కొందరంటారు. భారత్ పేదదేశం కాదు, అమెరికా కంటే ధనవంతమైన దేశం. భారత్ బుద్ధిజీవుల దేశం. ఎంతో మంది మహాపురుషులు ఈ నేల మీద ఎన్నో గొప్ప కార్యాలు నిర్వహించారు. ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా ఇక్కడి ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆ పరిస్థితి మారాలి. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులు కాదు.. ప్రజలు, రైతులు గెలవాలి’’ అని కేసీఆర్ అన్నారు.

భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‭లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా దేశంలోని చాలా చోట్ల తాగు నీరు లేదని, కరెంటు సరిగా అందడం లేదని విమర్శించారు. తాను రాజకీయం చేయడానికి మహారాష్ట్రకు రాలేదని, దేశంలో మార్పు తీసుకువచ్చేందుకే భారాసను దేశ వ్యాప్తంగా తీర్చిదిద్దున్నానని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com