TSRTC ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్

- February 20, 2023 , by Maagulf
TSRTC ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్

హైదరాబాద్‌: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి.. తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.

హైదరాబాద్‌‭లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (CPM) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com