అమ్మా! నువ్వు మళ్ళీ వస్తావా?

- February 22, 2023 , by Maagulf
అమ్మా! నువ్వు మళ్ళీ వస్తావా?

బేగంపేట్ లైఫ్ స్టైల్ ముందర ఆటో కోసం ఎదురు చూస్తున్న నాకు, 'నీలిమా మేడం! నీలిమా మేడం!' అని ఎవరో నన్ను  పిలుస్తున్నన్నట్టు వినిపించి తల తిప్పి చూసా.  ప్రతిమ గబగబా నడుస్తూ నా వైపు వస్తోంది.

'ఎన్ని ఏళ్ళు అయ్యింది మేడం మిమ్మల్ని చూసి, ఎలా వున్నారు, ఎప్పుడు వచ్చారు?' అంటూ నా చేతులు పట్టేసుకుని  ప్రశ్నల వర్షం కురిపించింది.

'బావున్నా, నువ్వు ఎలా వున్నావు? 10  ఏళ్ళు అవుతోంది ఏమో కదా నిన్ను చూసి' అని తనని ఆప్యాయం గా దగ్గరకి తీసుకున్నా.

'అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా ' అని, దగ్గర వున్న కాఫీ షాప్ లోకి వెళ్ళాము. మా కబుర్ల తో రెండు గంటలు యిట్టె గడిచిపోయాయి.

 'ఈ వీకెండ్  మీ ఫామిలీతో  మా ఇంటికి లంచ్ కి రండి మేడం. రాజు, సుధీర్ గారికి కాల్ చేసి చెప్తారు' అంది.

 'సరే, మీరు కూడా ఆ నెక్స్ట్ వీక్ మా ఇంటికి తప్పకుండా రావాలి' అని బై చెప్పి వచ్చేసా.

ఇంటికి వచ్చిన మాటే కానీ నా మనసు గతం లోకి వెళ్ళిపోయింది. అవి ఒక పదేళ్ల క్రితం, నేను ప్రీస్కూల్ కి హెడ్ మిస్ట్రెస్  గా వున్న రోజులు. కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోటానికి ఇంటర్వూస్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది వచ్చారు ఇంటర్వ్యూ కి . వాళ్లలో,ఒక అమ్మాయి  సన్నగా, పొడవుగా,హుందాగా  ఉన్నది. వచ్చింది. తన బయోడేటా చూస్తే MBA గోల్డ్ మెడలిస్ట్, ఇంకా ఏవో చాలా కోర్సెస్ చేసింది.

'నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ కదా ఈ జాబ్ కి అంటే, 'నాకు పిల్లలు అంటే ఇష్టం మేడం, ఈ ఫార్మాటివ్ స్టేజి లోనే వాళ్లకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి, వాల్యూస్  గురించి చెప్పాలి అంటూ తాను అలా ధారాళంగా మాట్లాడూతూ ఉంటె మంత్ర ముగ్ధురాలినయ్యి విన్నా.

తను  ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకి వెళ్ళంగానే, ప్రీస్కూల్ చైర్మన్ ప్రదీప్ గారు,
'నీలిమ, ఇంటర్వ్యూ అప్పుడు ఇలాగే అన్ని కబుర్లు చెప్తారు, తీరా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వేరే మంచి జాబ్ వస్తే  ఠక్కున మానేసి వెళ్ళిపోతారు, కమిటీట్మెంట్ ఉండదు ఇంకెవరినన్నా సెలెక్ట్ చేద్దాం' అన్నారు.

 'ఈ అమ్మాయి ఆలోచనా దృక్పథం , ఆశయాలు బావున్నాయండి, తను అలాంటిది కాదు' అని ఆయనని కన్విన్స్  చేసి సెలెక్ట్ చేసా.

ప్రతిమ జాయిన్ అయ్యిన కొన్ని రోజులకే పిల్లలకి చాలా క్లోజ్ అయ్యింది. రైమ్స్, గేమ్స్, గుడ్ హ్యాబిట్స్ అన్ని పిల్లలకి చక్క గా చెప్తూ మంచి  పేరు తెచ్చుకుంది. తను జాయిన్ అయ్యిన కొద్దీ నెలలకే శాన్వి అని ఒక చిన్న పాప జాయిన్ అయ్యింది. బొద్దుగా, ముద్దుగా,యాక్టీవ్ గా ఉండేది. వాళ్ళ అమ్మ రోజు వచ్చి దింపి వెళ్ళేది. స్కూల్ సేఫ్టీ ఎక్సరసైజ్ లో ఒక భాగంగా,  ఉదయం పూట పిల్లలు లోపలికి  వచ్చేంత వరకు నేను, టీచర్స్, ఆయాలు గేట్ దగ్గరే ఉండి, పిల్లలందరిని లోపలికి జాగ్రత్త గా పంపే వాళ్ళం.

 'అమ్మా నువ్వు మళ్ళీ వస్తావా?'  తన అర చెయ్యిని ముందరకి ప్రామిస్ అన్నట్టు చాపి,శాన్వి వాళ్ళ అమ్మని అడిగేది.  వాళ్ళ ఆమ్మ,  'మళ్ళీ వస్తా నాన్న' అని శాన్వి చేతిలో ప్రామిస్ చేసి వెళ్ళేది. అలా చేస్తున్నప్పుడు, రెండు మూడు సార్లు శాన్వి వాళ్ళ ఆమ్మ కళ్ళలో నీళ్లు తిరగటం చూసా. కొత్తగా స్కూల్ కి వస్తోంది కదా, శాన్విని మిస్ అవుతోంది అనుకున్నా.

రోజూ  డిస్మిస్సల్ తర్వాత పేరెంట్స్ ఎవరో ఒకరు వచ్చి పిల్లలని ఇంటికి తీసుకు వెళ్తారు. ఒక రోజు శాన్వి కోసం చాలా సేపు ఎవరూ రాలేదు.  పేరెంట్స్ కి ఫోన్ చేస్తే.....నో రెస్పాన్స్.

నేను, ప్రతిమ,ఇంకో ఆయా చాలా సేపు ఉండిపోవాల్సి వచ్చింది. శాన్వికి స్కూల్ కుక్ చేత వంట చేయించాం. తను తిని మళ్ళీ స్కూల్ లో ఆడుకుంటోంది. ఇంతలో శాన్వి వాళ్ళ అమ్మ క్యాబ్ దిగింది. ఎందుకో చాలా నీరసంగా వుంది.  ' సారీ మేడం, హాస్పిటల్ కి  వెళ్ళా లేట్ అయ్యింది అక్కడ, నా హస్బెండ్ ఢిల్లీ వెళ్లారు అందుకే రాలేకపోయాం' అంది.

'ఫర్వాలేదు. ఒక్క రోజు కి మాకు శ్రమేమి కాదు అన్నా. జనరల్ చెక్ అప్ కి వెళ్ళారా?ఈజ్
 ఎవిరీథింగ్ ఓకే? అన్నా.

'మీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నా'. నాకు కేన్సర్ జీరో  స్టేజి లో డయాగ్నోస్ అయ్యింది. రొటీన్ మమ్మోగ్రామ్ లో తెలిసింది, కెమోథెరపీ అక్కర్లేదు కానీ భయం ఎప్పుడు నెక్స్ట్ స్టేజి వస్తుందేమో అని. రెగ్యులర్ చెక్ అప్ కి వెళ్తా. నాకు, మా హస్బెండ్ కి పేరెంట్స్ ఎప్పుడో పోయారు. నాకేమన్నా అయితే శాన్వి ఏమవుతుందేమో అని భయం మేడం అని కళ్లనీళ్లు పెట్టుకుంది. నాకు చాలా బాధ వేసింది. తర్వాత తనని కౌన్సెల్ చేసి, ధైర్యం గా పాజిటివ్ గా ఉండమని, ఎటువంటి హెల్ప్ కావాలన్నా అడగమని  చెప్పా.

ఇదంతా విన్న ప్రతిమ, శాన్వి వాళ్ళ అమ్మ వెళ్ళంగానే ఒకటే ఏడవటం మొదలు పెట్టింది. శాన్వి వాళ్ళ మమ్మీ ని కంటే ప్రతిమ ని కన్సోల్ చేసేసరికి నా తల ప్రాణం తోక కి వచ్చింది.ఇప్పుడే వినింది  కదా సర్దుకుంటుంది అనుకంటె, నెక్స్ట్ డే నుంచి శాన్వి కి అందరి పిల్లల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, మరి గారాబం చెయ్యటం మొదలు పెట్టేసరికి  శాన్వి కొంచెం పెంకి గా, మొండి గా తయారయ్యింది.

ఇలా కొన్నాళ్ళు చుసిన నేను లాభం లేదు అని ప్రతిమకి చెప్పా, " నీకు  వాళ్ళ మమ్మీ గురించి తెలిసాక బాధ గా ఉంటె, తనని నీ అతి గారాబం, సాఫ్ట్ కోర్నెర్ తో ఇంకా పాడు చెయ్యకు, తనని ఇండిపెండెంట్ గా,ధైర్యవంతురాలు గా చెయ్యి. అయినా వాళ్ళ అమ్మ కి ఏమయ్యింది అని. ఎర్లీ గా డయాగ్నోసిస్, ఆవిడ కి జరగాల్సిన టైంలీ ట్రీట్మెంట్ జరిగింది. రెగ్యులర్ చెక్ అప్ కి వెళ్తోంది. ఆవిడకి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇవ్వు,ఏమి సహాయం కావాల్సిన చెయ్యి, అంతే కానీ పిల్ల ని ఇలా పాడు చెయ్యకు' అన్నా.
 
ఆ తర్వాత కొన్ని నెలలకి సుధీర్ కి కెనడా లో జాబ్ వచ్చి మేము వెళ్ళిపోయాము. ఇంకొన్ని నెలలు స్కూల్ వాళ్ళు అందరి తో టచ్ లో ఉన్నా తర్వాత ఎవరికీ వారం బిజీ అయ్యి  మా మధ్య మెయిల్స్ తగ్గి పోయాయి.

ఇదిగో ఇలా మళ్ళీ ఇన్నేళ్లకి ఇలా కలిసా. మాటలలో తెలిసింది ప్రతిమ గురించి, వీలు అయితే వాళ్లకి ఏమైనా సహాయం చెయ్యి అని నేను అన్న మాటలకి, తాను సీరియస్ గా తీసుకుని క్లినికల్ కౌన్సిలింగ్ లో డిగ్రీ చేసి, ఏదయినా జబ్బు తో బాధ పడుతున్న వాళ్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తాను ఎంతో మానసిక ధైర్యమ్ కలిపిస్తోంది, ఇలాంటి అనుకోని పరిణామాలు ఎదురయినప్పుడు ఎలా ఎదుర్కొనాలి అని రకరకాలు గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ చుట్టూ పక్కల గ్రామాలకి వెళ్లి చేస్తోంది.

నాకు తనని చూసి ఎంతో స్ఫూర్తి వచ్చింది, నా వంతు సహాయం నేను కూడా చెయ్యాలి, తన ఆశయాన్ని  ఇంకా బాగా ముందుకు నడిపించాలి అన్న సంకల్పం తో , పొద్దున లేచి తనకి ఫోన్  చేసి ఈ విషయం చెప్పాలి అనుకుంటూ నిద్ర కి ఉపక్రమించా.

--- జానకి విశ్వనాధ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com