శ్రీలంకలో పెట్టుబడులకు అదానీ గ్రూప్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

- February 25, 2023 , by Maagulf
శ్రీలంకలో పెట్టుబడులకు అదానీ గ్రూప్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అదానీ గ్రూప్‌కు చెందిన రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లకు శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లపై శ్రీలంకలో అదానీ ఎనర్జీకి 442 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దీంతో అవకాశం లభించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌కు ఇది ఊరట కలిగించే అంశమని భావిస్తున్నారు.

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో కొత్త పెట్టుబడుల విషయంలో అదానీ గ్రూప్‌ అచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభించే విషయంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుత తరుణంలో కొత్త వాటిని చేపటడడంలేదని, నడుస్తున్నవాటిని పూర్తి చేస్తామని ఇటివలే అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

శ్రీలంకలోని మన్నార్‌ ప్రాంతం లో 250 మెగావాట్ల సామర్ధ్యంతో పవన విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించాలని అదానీ గ్రూప్‌ గతంలో నిర్ణయించింది. పూనెరిన్‌లో 100 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదానీ ప్రతిపాదనలను పరిశీలించిన శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు అనుమతులు ఇస్తూ లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌ జారీ చేసింది. 350 మెగావాట్ల విద్యుత్‌ సామర్ధ్యం ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్‌లను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025 నాటికి శ్రీలంక నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ల వల్ల 2 వేల మంది వరకు ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ వారం ప్రారంభంలో శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజిశేఖరతో అదానీ గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ శ్రీలంకలోని కోలంబో పోర్టులోని పశ్చిమ కంటైనర్‌ టెర్మినల్‌లో పెట్టుబడులు పెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com