పరిపాలనా రాజధాని విశాఖపట్నమే.. ఏపీ సిఎం జగన్‌

- March 03, 2023 , by Maagulf
పరిపాలనా రాజధాని విశాఖపట్నమే.. ఏపీ సిఎం జగన్‌

విశాఖపట్నం: గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ సిఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిఫ్ట్‌ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని జగన్ చెప్పారు. ‘‘ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులవైన పారిశ్రామిక విధానం ఉంది. క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నా. త్వరలోనే ఇది సాకారమవుతుంది’’ అని వివరించారు.

ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. దేశ ప్రగతిలో రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని తెలిపారు. ఇక్కడ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని జగన్ చెప్పారు. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని.. మరో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయని వెల్లడించారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయని తెలిపారు. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని జగన్‌ తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవలేదన్నారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నగరం నెలవని వ్యాఖ్యానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com