భక్తులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

- March 17, 2023 , by Maagulf
భక్తులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: దేవాలయాల్లో తలనీలాలు ఇచ్చే భక్తులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ.20 వేల చొప్పున కమిషన్ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం భక్తుల నుంచి వసూలు చేస్తున్న రూ. 25 ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షురకులకు ఇస్తున్నారు. అయితే, ఈ మొత్తం సరిపోవడం లేదని, ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు రెగ్యులర్ ఉద్యోగుల్లానే కనీస వేతనం ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పెంచిన టికెట్ ధర రూ. 40 ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని క్షురకులకే ఇస్తారు. అంటే తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయాన్ని ఆలయంలోని క్షురకులందరికీ సమానంగా పంచుతారు.

రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కేశఖండన విధులు నిర్వర్తించే క్షురకులు 1,100 మంది ఉంటారని తెలుస్తోంది. అప్పటికీ సరిపోకుంటే మిగిలిన మొత్తం కోసం ఆలయ అధికారులు కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది జనవరి నుంచి పనిచేస్తున్న క్షరుకులకే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com