వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల హౌస్ అరెస్టు

- March 17, 2023 , by Maagulf
వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల హౌస్ అరెస్టు

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ వచ్చిన షర్మిల.. టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఆమె ఇంటి దగ్గర పోలీసు బలగాల్ని మోహరించారు. తర్వాత హౌస్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు.

తనను హౌస్ అరెస్టు చేయడంపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. టీఎస్ పీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి. ఎనిమిదేళ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలి. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉంది. నిరుద్యోగుల విశ్వసనీయతను టీఎస్ పీఎస్సీ కోల్పోయింది’’ అని ట్వీట్ చేశారు.

‘‘సొంతూరును వదిలి, పట్టణాల బాటపట్టి.. కోచింగులు, పుస్తకాల కోసం అప్పులు చేసి.. రాత్రనకా, పగలనకా నిరుద్యోగులు కష్టపడుతుంటే.. అంగట్లో సరుకులా ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం సిగ్గుచేటు. ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. కెసిఆర్ కు కవిత కేసుల మీద ఉన్న సోయి టీఎస్ పీఎస్సీ మీద లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com