టివిఎస్ గ్రూపులో 116 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉపాధి

- March 17, 2023 , by Maagulf
టివిఎస్ గ్రూపులో 116 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉపాధి

అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్ధుల తక్షణ ఉపాధికోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇప్పటికే పలు సంస్ధలలో పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం విద్యార్ధులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. తాజాగా గుంటూరు మద్ది బాలత్రిపుర సందరమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో టివిఎస్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో 116 మంది ఎంపిక అయ్యారన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ విభాగాలకు చెందిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు లభించగా, శుక్రవారం వారందరికీ నియామక లేఖలు అందించామన్నారు. వీల్స్ ఇండియా సంస్ధ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టగా, వీరందరికీ 2.4 లక్షల సాంవత్సరిక వేతనంతో పాటు ఇతర సదుపాయాలు ప్రారంభంలో అందిస్తారని నాగరాణి వివరించారు. 

క్రీడలలోనూ రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యార్ధుల ప్రతిభ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్ధులు క్రీడాంశాలలోనూ తమదైన ప్రతిభను చూపుతున్నారని నాగరాణి పేర్కొన్నారు. నాలుగవ అఖిల భారత దక్షిణ ప్రాంత పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2022-23లో 14 విభాగాలలో తమదైన ప్రతిభను చూపారన్నారు. హైదరాబాద్ లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఈ మీట్ లో దేశంలోని దక్షిణాది రాష్ట్రాల పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారన్నారు. షాట్ పుట్, హైజంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, వాలీబాల్, చెస్, టేబుల్ టెన్నిస్, 100, 200, 300, 400 మీటర్ల పరుగు పందెం విభాగాలలో బాలబాలికలు వేర్వేరుగా పోటీ పడి తొలి మూడు స్దానాలలో స్దానం పొందగలిగారన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల నుండి 40 మంది బాలికలు,  52 మంది బాలురు ఈ మీట్‌లో పతకాలు అందుకున్నారని నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com