ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సత్కరించిన చంద్రబాబు

- March 20, 2023 , by Maagulf
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సత్కరించిన చంద్రబాబు

అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం తో ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి భూమి రెడ్డి రామగోపాలరెడ్డి వైస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించగా, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు.

ఈ క్రమంలో సోమవారం గెలిచిన అభ్యర్థులను అధినేత చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. అలాగే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుగారి అనుభవం, మన అభ్యర్థుల పోరాటం, కార్యకర్తలు, నేతల ధైర్యం, వారి పనితీరుతోనే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించామని తెలిపారు. టీడీపీ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ ఎప్పుడూ నిలవలేదని… కానీ జగన్ అరాచకాలను చూసిన తర్వాత బరిలో నిలిచామని అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలను చంద్రబాబు రాత్రింబవళ్లు పర్యవేక్షించారని.. టీడీపీకి ఓటేస్తే విశాఖ రాజధాని కాకుండా పోతుందని వైస్సార్సీపీ ప్రచారం చేసినా ఉత్తరాంధ్రలో టీడీపీ ఘన విజయం సాధించిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com