ఆసియాకప్-2023: పంతం నెగ్గించుకున్న భారత్..
- March 24, 2023
న్యూ ఢిల్లీ: ఈ ఏడాది చివరిలో ఆసియాకప్-2023 టోర్నమెంట్ పాకిస్థాన్ వేదికగా జరగనుంది. అయితే, పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ (BCCI) అంగీకరించలేదు. అవసరమైతే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని చెప్పేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా అంతేఘాటుగా స్పందించింది. ఆసియా కప్ కోసం పాక్‌కు టీమిండియా రాకుంటే తాము భారత్‌లో జరిగే ప్రపంచ వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని హెచ్చరించింది.
ఈ రెండు దేశాల మాజీ క్రికెటర్ల మాటల యుద్ధంతో ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ జట్టు పాల్గొనడం అనుమానంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. గతవారం దుబాయ్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యులందరితో పీసీబీ అధికారులు సమావేశమైన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీసీబీ, బీసీసీఐ ప్రతినిధుల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగిన తరువాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనక్కుతగ్గినట్లు తెలిసింది.
టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్‌లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్‌లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జరిగే మ్యాచ్‌తో సహా తటస్థ వేదికపైనే టీమిండియా మ్యాచ్ ఆడేందుకు పీసీబీ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. పాకిస్థాన్ అన్ని ఇతర మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా, పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్‌తో సహా టీమిండియా ఐదే మ్యాచ్‌లను తటస్థ వేదికలపైనే ఆడనుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్, ఇండియా తలపడాల్సి వచ్చిన మ్యాచ్ తటస్థ వేదికలపైనే జరిగేలా సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్ వేదికగా ప్రారంభమవుతుంది. ఆరు దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. గ్రూప్ -ఏ లో ఇండియా, పాకిస్థాన్, క్వాలిఫై-1, గ్రూప్ – బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. 13 రోజుల పాటు జరిగే టోర్నీలో 13 మ్యాచ్‌లు జరుగుతాయి.
తాజా వార్తలు
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!
- డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు







