కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల‌కు..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

- March 25, 2023 , by Maagulf
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల‌కు..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

బెంగుళూరు: త్వరలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను పార్టీ అధిష్టానం తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేసింది.శనివారం ఉదయం మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది.రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు టికెట్ దక్కింది. కోలార్ నుంచి పోటీ చేయాలనుకున్న సిద్ధిరామయ్య తన కుమారుడి స్థానం నుంచి టికెట్ దక్కించుకున్నారు. కొరటగెరె నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. అయితే, త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం.కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.2018లో ఎన్నికలు జరగగా 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 80, జేడీ(ఎస్) 37 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com