ఉద్యోగాల కోసం బండి సంజయ్ ఢిల్లీలో ధర్నా చేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

- March 25, 2023 , by Maagulf
ఉద్యోగాల కోసం బండి సంజయ్ ఢిల్లీలో ధర్నా చేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఉద్యోగాల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. బండి సంజయ్ శనివారం నిరుద్యోగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను ఖండిస్తూ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ (Tspsc)లో ఏదో జరిగిందని కెసీఆర్‌పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒకాయన నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. మీరు ఎన్ని కొంగ జపాలు చేసిన రాష్ట్రంలో బీజేపీకి నిరుద్యోగం తప్పదు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇవ్వట్లేదు అని మోదీ ఎన్నికల్లో చెప్పి గెలిచారు. కానీ 9ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశ నిరుద్యోగులను మోసం చేస్తోంది మోదీ, బీజేపీనే. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వీటి కోసం బండి సంజయ్ ఢిల్లీలో ధర్నా చేయాలి. టీఎస్‌పీఎస్‌సీ (Tspsc)లో జరిగిన ఘటనను మేమే బయట పెట్టాం. జరిగిన తప్పును చూపింది మేము. దొంగలను పట్టుకుంది మేము. మీలాగా ఈడి, సీబీఐ అంటూ వెంట వెళ్లి చూడలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నాం. మీ మధ్యప్రదేశ్‌లాగా స్కాంలు చేయలేదు. మీలాగా పార్టీ నాయకులను చంపి, సాక్షులను చంపింది మేము కాదు. దేశంలోనే తెలంగాణ పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వరాదన్న అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి.

సీబీఐ విచారణ డిమాండ్ వెనుక బీజేపీ కుట్ర ఉంది. ఓయూ ఆందోళనల వెనుక ఎవరున్నారో తేలుస్తాం. దేశంలో తొమ్మిది ఏళ్లుగా నియంతృత్వ పాలన కొనసాగుతోంది. విపక్షాల ఉనికి లేకుండా చూడాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీపై ఆనర్హత వేటు వేసింది. పార్లమెంట్ వేదికను ప్రతిపక్షాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని కూడా తిప్పికొట్టలేని పరిస్థితిలో, ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. దేశ ప్రజలకు విజ్ఞత ఉంది. మోదీ నియంతృత్వ పాలన ఎన్నో రోజులు సాగదు. దేశ ప్రజలకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com