న్యాయవ్యవస్థలో మార్పులకు పూనకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం..

- March 27, 2023 , by Maagulf
న్యాయవ్యవస్థలో మార్పులకు పూనకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం..

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ ప్రభుత్వం ఆ దేశంలో న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ దేశంలోని లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేసేలా నేతన్యూహు ప్రభుత్వం సంస్కరణలను తీసుకొస్తోంది. కోర్టులోని న్యాయమూర్తులను కూడా రాజకీయ నాయకులే నిర్ణయించేలా ఆ సంస్కరణలున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సమతుల్యత పెరుగుతుందని ప్రభుత్వ మద్దతుదారులు అంటున్నారు. కానీ, ఈ సంస్కరణల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని విపక్షాలు సహా సామాజిక సంస్థలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం సూచించిన సంస్కరణలకు ఆమోదం లభిస్తే నెతన్యాహు చేతికి అంతులేని అధికారాలు వస్తాయని, ఇప్పటికే వివక్షకు గురవుతున్న పాలెస్తీనా మైనార్టీలు, మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రధాని బెంజమిన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసుల నుంచి బయటపడేందుకే న్యాయవ్యవస్థలో ఈ మార్పులు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను నెతన్యాహూ కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఆందోళనకారులు మాత్రం దీనిపై గట్టిగానే విమర్శలు కురిపిస్తున్నారు. భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతుండడంతో ఇజ్రాయెల్‌సంక్షోభంలోకి వెళ్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

దేశ జనాభాలో 5 శాతం మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు నిరసనకారులు చెబుతున్నారు. మాజీ ప్రధాన మంత్రులు, మిలిటరీ ప్రముఖులతోపాటు టెక్ కంపెనీలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తుండడం విశేషం. కాగా, న్యాయ విధానంలో వివాదాస్పదమైన సంస్కరణలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌పై వేటు పడింది. రక్షణ శాఖ మంత్రిగా యోవ్ గాలంట్‌పై తనకు నమ్మకం లేదని నెతాన్యాహు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com