ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో భేటీ ..!

- April 03, 2023 , by Maagulf
ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో భేటీ ..!

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ల‌తో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో వీరు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమిత్ షా, నడ్డాలతో భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, టీడీపీతో కలిసి వెళ్లే అంశంపైనా, జనసేన, బీజేపీ పార్టీల భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలపైనా పవన్ చర్చించే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్‌గా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనకు సహకరించడం లేదని పవన్ అన్నారు. దీనికితోడు ఏపీ బీజేపీ నేతలతో పవన్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు పేరుకే అన్నట్లుగా ఉందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత ఢిల్లీ టూర్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా తన కార్యాచరణ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుద్వారా వైసీపీని ఓడించొచ్చని పవన్ చెప్పకనే చెప్పారు. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీలో పవన్ ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు.

తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించే ఆలోచనలో బీజేపీ కేంద్ర పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపైకూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ సమయంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జనసేన అధినేత సడన్ గా ఢిల్లీ వెళ్లడం, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యే అవకాశాలుఉండటంతో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com