విల్లన్లుగా మారుతున్న హీరోలు

- May 08, 2016 , by Maagulf
విల్లన్లుగా మారుతున్న హీరోలు

''నెగెటివ్‌ క్యారెక్టర్‌ అయితే నా టాలెంట్‌ మొత్తం చూపిస్తా'' అంటారు బ్రహ్మానందం 'దూకుడు' చిత్రంలో. బ్రహ్మీ చెప్పిన డైలాగ్‌ ఆంతర్యం ఏమిటంటే ప్రతిభ చూపించడానికి ప్రతినాయకుడి పాత్ర అయితే మేలన్నమాట. ఒకప్పుడు ప్రతినాయకులు కథానాయకులగా మారారు. ఇప్పుడున్న స్టార్‌ కథానాయకుల్లో చాలా మంది తొలుత ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించిన వారే. అయితే గత కొంత కాలం నుంచి సీన్‌ రివర్స్‌ అయిపోయింది. హీరోగా వెలుగొందిన నటులు ప్రతినాయక పాత్రలపై మనసు పారేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ విశేషాలు చూద్దామా! స్టైలిష్‌ విలన్‌.. కథానాయకుడిగా ఎన్నో మరుపురాని విజయాలు అందుకున్నారు జగపతిబాబు. జీవితంలో ఎత్తు పల్లాలను, ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా, నటుడిగా అంతకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'లెజెండ్‌' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విలనిజాన్ని తనదైన శైలిలో చూపించి అందరీ మెప్పు పొందారు. ఈ ఏడాది విడుదలైన ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..'లో కూడా స్టైలిష్‌గా విలనిజాన్ని పండించారు. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా నాలుగు భాషల్లో నటిస్తూ బిజిబిజీగా ఉన్నారు.

నందమూరి నట వారసుడి తెరంగ్రేటం చేశాడు తారకరత్న. 2002లో ఒకటో నెంబరు కుర్రాడితో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూ వచ్చారు. రవిబాబు దర్శకత్వం వహించిన 'అమరావతి' చిత్రంతో తొలిసారి ప్రతి నాయకుడిగా కనిపించారు. ఈ చిత్రంలో తారకరత్న నటనకు నంది అవార్డు సైతం ఆయన ఖాతాలో చేరిపోయింది. తాజాగా నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన 'రాజా చెయ్యివేస్తే' చిత్రంలో మరోసారి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఏ రంగంలో రాణించాలన్న ముఖ్యంగా టాలెంట్‌తో పాటు అదృష్టం కలిసిరావాలంటూ ఇటీవల ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు తారకరత్న.

వైరం ధనుష్‌.. పెరాఫామెన్స్‌ అదుర్స్‌ 'ఒక విచిత్రం' చిత్రంతో నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆది పినిశెట్టి 'వైశాలి', 'గుండెల్లో గోదారి', 'మలుపు' చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. అయితే ఇప్పటి వరకు కథానాయకుడిగా, నటుడిగా అలరిస్తూ వచ్చిన ఆయన ఈ ఏడాది ప్రతి నాయకుడిగా అదరగొట్టేశాడు. బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం 'సరైనోడు'. మాస్‌ మసాలా చిత్రంగా బాక్సాఫీస్‌ వద్ద కాసులను కొల్లగొడుతున్న ఈ చిత్రంలో ఆది నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. వైరం ధనుష్‌గా ఆది నటన ఆకట్టుకుంది. ఎంతగా అంటే ఈ చిత్రాన్ని వేరే భాషలో తెరకెక్కిస్తే ఆ పాత్రను అల్లు అర్జున్‌ చేస్తాననేలా. అంత చక్కగా తీర్చిదిద్దారు 'వైరం ధనుష్‌' పాత్రను బోయపాటి.

మరోసారి సిద్ధమవుతున్న భళ్లాలదేవుడు 'బాహుబలి'.. జక్కన్న రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం. అందరి ప్రశంసలనే కాదు అవార్డులను, రివార్డులను కొల్లగొట్టింది ఈ చిత్రం. కథానాయకుడిని ధీరోదాత్తునిగా చూపిండంలో రాజమౌళి శైలే వేరు. అలాంటి బలమైన పాత్రలకు అంతే బలమైన ప్రతినాయకులను ఎంచుకుంటున్నారు. బాహుబలి చిత్రంలో కూడా ప్రభాస్‌కు ధీటుగా రానాను ఎంచుకున్నారు. తొలి భాగంగా అద్భుతమైన విలనిజాన్ని పండించిన రానా మలి భాగంలో మరింతగా అలరించనున్నాడు. ఈ చిత్రం కోసం రానా శారీరకంగా ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు.

బాలీవుడ్‌లో సుధీర్‌బాబు శివ మనుసులో శృతి, ప్రేమ కథాచిత్రమ్‌ తదితర చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించిన సుధీర్‌బాబు 'బాఘి' చిత్రంలో ప్రతినాయకుడిగా మారారు. సబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌లు నటించారు. 'బాఘి' కోసం సుధీర్‌బాబు తన దేహ దారుఢ్యాన్ని కూడా మార్చుకున్నారు.
మరికొందరు.. ప్రతినాయకుడిగా కెరీర్‌ను ప్రారంభి కథానాయకుడిగా మారిన వారు కొందరైతే.. మరికొందరి పరిస్థితి భిన్నంగా ఉంది. 'తొలి వలపు' చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టిన గోపీచంద్‌ 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాలతో ప్రతినాయకుడిగా మెప్పించారు. ఆ తర్వాత హీరోగా అద్భుత విజయాలను అందుకున్నారు. ఇక యువ కథానాయకుడు నవదీప్‌ కూడా ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించారు.
ముఖ్యంగా కథ, పాత్రలు డిమాండ్‌ చేస్తే విలనిజానికి ఓటేసే వారి సంఖ్య చిత్ర పరిశ్రమలో రోజురోజుకీ పెరుగుతోంది. భవిష్యత్తులో మరింత మంది కథానాయకులు ప్రతినాయకుడి పాత్ర కోసం క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com