CBSE 10, 12వ తరగతి పరీక్షలలో కీలక మార్పులు

- April 07, 2023 , by Maagulf
CBSE 10, 12వ తరగతి పరీక్షలలో కీలక మార్పులు

న్యూఢిల్లీ: 2024లో నిర్వహించే 10 , 12 తరగతుల బోర్డు పరీక్షలకు మరిన్ని బహుళ-ఎంపిక ప్రశ్నలను (MCQలు) పెంచనున్నట్లు CBSE ప్రకటించింది. ఇదే సమయంలో లాంగ్ ఆన్సర్ ప్రశ్నలకు వెయిటేజీని తగ్గించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మూల్యాంకన(ఇవాల్యుయేషన్) పథకాన్ని పునరుద్ధరించినట్లు పేర్కొంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సుల మేరకు మూల్యాంకనంలో క్రమంగా మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ మార్పు 2023-24 అకడమిక్ సెషన్‌కు మాత్రమే పరిమితం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF) పరిచయంతో బోర్డు పరీక్షలలో సంస్కరణలు జరుగనున్నాయని CBSE (అకడమిక్స్) డైరెక్టర్ జోసెఫ్ ఇమాన్యుయెల్ అన్నారు. 10వ తరగతిలో 50 శాతం ప్రశ్నలు MCQలు, కేస్ ఆధారిత ప్రశ్నలు, సోర్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు లేదా మరేదైనా రకంలో సామర్థ్య ఆధారితంగా ఉంటాయన్నారు. గత అకడమిక్ సెషన్‌లో ఇలాంటి ప్రశ్నలకు వెయిటేజీ 40 శాతంగా ఉందన్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇప్పుడు తప్పనిసరిగా 20 శాతం వెయిటేజీతో MCQలుగా ఉంటాయని, షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ తరహా ప్రశ్నలకు వెయిటేజీని గతేడాది 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించామన్నారు. అదేవిధంగా 12వ తరగతిలో 40 శాతం ప్రశ్నలు MCQలు, కేస్-కేస్డ్ ప్రశ్నలు, సోర్స్-బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు ఉంటాయని, గత అకడమిక్ సెషన్‌లో ఇలాంటి ప్రశ్నలకు వెయిటేజీ 30 శాతం ఉందని తెలిపారు. 12వ తరగతిలో కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇప్పుడు తప్పనిసరిగా 20 శాతం వెయిటేజీతో MCQలుగా ఉంటాయన్నారు. షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ తరహా ప్రశ్నలకు వెయిటేజీని గతేడాది 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com