కరీంనగర్‌లో భారీ పోలీస్ బందోబస్తు..

- April 07, 2023 , by Maagulf
కరీంనగర్‌లో భారీ పోలీస్ బందోబస్తు..

కరీంనగర్: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఉదయం జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. సంజయ్ విడుదల సందర్భంగా కరీంనగర్ జైలు వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.శుక్రవారం సాయంత్రం 6గంటల వరకు నగరంలో 144 సెక్షన్ విధించారు.

టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు క్రితం అరెస్టు చేసిన పోలీసులు హన్మకొండ జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు సంజయ్ ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు బండి సంజయ్ లాయర్లు బెయిల్ మంజూరి కోసం పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటీషన్ పై గురువారం సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చివరకు గురువారం సాయంత్రం సమయంలో హన్మకొండ జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత సుదీర్ఘ విచారణ చేపట్టారు. దాదాపు 8 గంటలు వాదనలు కొనసాగాయి.

కుట్ర కోణంతో బండి సంజయ్‌ని ఈ కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే విచారణ కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోరారు. బండి సంజయ్ ఫోన్ మిస్ అయ్యిందని, అందులో విలువైన డేటా ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్‌ని కస్టడీకి ఇస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరికి బండి సంజయ్‌కి రూ. 20వేల సొంత పూచీకత్తుతో పాటు పలు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చారు.

బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు. బండికి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు జైలు వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ సంజయ్ బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విర్శలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసును పక్కదారి పట్టించేందుకు టెన్త్ పేపర్ లీకేజీ కేలో తెరపైకి తెచ్చారని, టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com