రేపు హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ..
- April 13, 2023
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రేపు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
గులాబీలు, తెల్లటి పువ్వులు మరియు తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందిస్తున్నారు. 125 అడుగుల విగ్రహానికి ఉన్న భారీ కర్టెన్‌ను తొలగించి నిలువుగా అలంకరించేందుకు భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు. ఈ కార్యక్రమం వారి సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరు కానున్నట్లు సమాచారం.
ప్రజలను తరలించేందుకు 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. హైదరాబాద్ చేరుకోవడానికి 50 కిలోమీటర్ల లోపు సభకు వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ వేడిమి నుంచి ప్రజలను రక్షించేందుకు షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సభ జరిగే రోజు సామాన్య ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసు యంత్రాంగం సూచించనుంది. ఆటపాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
అంబేద్కర్‌కు సంబంధించిన పాటలు మాత్రమే పాడి అంబేద్కర్‌కు సాంస్కృతిక నివాళులర్పించాలని సీఎం సూచించారు. ఇందుకు రిహార్సల్స్ బాధ్యతను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకున్నారు. అంబేద్కర్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆహ్వానం పలికారు. మహారాష్ట్రకు చెందిన అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించనున్నారు. సమావేశం ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమవుతుంది. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్య అతిథిగా ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ తుది సందేశం ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







