24న ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ..

- April 16, 2023 , by Maagulf
24న ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర పై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీ ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేసీఆర్.. తొలుత మహారాష్ట్రను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత పావులు కదువుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెండు సార్లు బహిరంగ సభలు జరిగాయి. ఈ సభలకు భారీ స్పందన లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరోసభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ నెల 24న ఔరంగాబాద్‌ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడో బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి.

మహారాష్ట్రలోని పలు ప్రాంతాలనుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక నేతల నుంచి పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే సీఎంను మహారాష్ట్ర నేతలు నిత్యం కలుస్తున్నారు. తాజాగా ఔరంగాబాద్ నుంచి కీలక నేతలు సీఎం కేసీఆర్ ను కలిసినట్లు తెలిసింది. తమ ప్రాంతంలో సభ నిర్వహించాలని వారు కోరారు. ఔరంగాబాద్‌లో తెలంగాణ వాసుల సంఖ్య ఎక్కువగానే ఉందని, వారంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని, సభ నిర్వహించడం ద్వారా వారందరిని బీఆర్ఎస్ వైపు ఆకర్షించొచ్చని సదరు నేతలు సీఎం కేసీఆర్ ను కోరినట్లు తెలిసింది. దీంతో ఈ నెల 24న సభ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు పలువురు పేర్కొంటున్నారు.

సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతల దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండుదఫాలుగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు జరిగాయి. భారీ సంఖ్యలో ప్రజలు సభలకు హాజరు కావటంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఔరంగాబాద్ లోని అంకాస్ మైదానంలో 24న జరగబోయే సభలో సీఎం కేసీఆర్ పాల్గోనున్న నేపథ్యంలో భారీ జనసమీకరణపై బీఆర్ఎస్ తెలంగాణ, మహారాష్ట్ర నేతలు దృష్టి కేంద్రీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com