TSRTC సంస్థలోకి తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
- April 17, 2023
హైదరాబాద్: ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతుంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలు...
12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది.
కాగా, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(OGL)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి అందజేయనున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు