ఏప్రిల్ 22 నుంచి గంగా పుష్కరాలు

- April 20, 2023 , by Maagulf
ఏప్రిల్ 22 నుంచి గంగా పుష్కరాలు

 వారణాసి: ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు 12 రోజుల పాటు గంగా పుష్కరాలు జరగనున్నాయి. గంగా పుష్కరాల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 29న వారణాసిలో గంగా ఘాట్ వద్ద కాశీ తెలుగు సంగమం కార్యక్రమం ఉంటుంది. శ్రీకాశి తెలుగు సమితి ఆధ్వర్యంలో ఎంపీ జీవీఎల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. తెలుగు భక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాల కోసం సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి 18 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నారు.

గంగా పుష్కరాల కోసం వారణాసి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తన్నట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. గంగా పుష్కరాల కోసం వచ్చే తెలుగు యాత్రికులకు హెల్ప్ లైన్ సహా వసతి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైలు ప్రారంభమైందన్నారు. గంగా పుష్కరాల కోసం వారణాసికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు వెళ్లడం సంతోషకరం అన్నారు. కాశీకి వెళ్లే వారిలో తెలుగు వారే ఎక్కువ అన్నారు. కాశీలో తెలుగు భక్తులను ఉద్దేశించి ఏప్రిల్ 29న కాశీ తెలుగు సంగమం సభలో ప్రధాని మోదీ మాట్లాడతారని ఎంపీ జీవీఎల్ తెలిపారు.

”ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు గంగా పుష్కరాలు జరుగుతాయి. నా చొరవతో కాశీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాని కార్యాలయం, జిల్లా యంత్రాంగం కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 5 ప్రత్యేక బస్ రూట్లు, 24 గంటల పాటు హెల్ప్ లైన్, పోలీస్ గస్తీ సహా తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. తెలుగు యాత్రికులకు ఇదివరకు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. విశాఖ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు.

పుష్కరాల సందర్భంగా విశాఖ, తిరుపతి, గుంటూరుతో పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏర్పాటు చేశారు. గంగా పుష్కరాల సమయంలోనే ఏప్రిల్ 29న ‘కాశీ తెలుగు సంగమం’ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ప్రధాని మోదీని కోరాను. నిన్ననే ప్రధాని కార్యాలయం నుంచి ఆయన పాల్గొనడం గురించి ధ్రువీకరిస్తూ సమాచారం ఇచ్చారు. కాశీతో తెలుగు ప్రజలకు ఉన్న సంబంధం మరెవరితోనూ ఉండదని చెప్పొచ్చు” అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com