వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలు...
- May 03, 2023
సింగపూర్: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు ఉత్సాహంగా, అత్యంత ఘనంగా శ్రీ వాసవి మాత జయంతిని చైనాటౌన్ నందలి శ్రీ మారియమ్మన్ ఆలయంలో జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సమయంలో జరుపుకోవటం కేవలం యాదృచ్ఛికమే కాక, ఇక్కడి ఆర్యవైశ్యులకు అత్యంత మోదాన్ని పంచే విశేషం కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిది గంటల పాటు నిర్విఘ్నంగా ఆద్యంతము ఆసక్తికరంగా జరిగిన పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సుమారు మూడు వందల యాభై మందికి పైగా ఆర్య వైశ్యులు పాల్గొని తమ శ్రద్ధ, భక్తి ప్రపత్తులను చాటి చెప్పారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని తృప్తిగా తెలుగు సంప్రదాయ భోజన, తీర్థ, ప్రసాదాలను సేవించి తరించారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన అనేకమంది ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో కార్యక్రమానికి వన్నెతెచ్చారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన బొబ్బ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మరియమ్మన్ ఆలయం, జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ గార్లు కూడా వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల,శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన VCMS , ఈ పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం కృషి ఉన్నాయి అని చెప్పారు.
'గణానాం త్వ గణపతిం' అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదం లోని గణపతి ప్రార్ధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ కూర్పు సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చగా, కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు.
అంతేగాక యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి ఉమా మోనిష నంబూరి ల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం మొదలైన సాంప్రదాయ నృత్య కళారీతులతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, మరియు చిరంజీవి కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి జరిపిన కుంకుమార్చన అలంకార పూజ పిదప జరిగిన రథయాత్రలో భాగంగా గాదంశెట్టి నాగ సింధు నేతృత్వంలో 16 మంది తరుణీమణులు చేసిన మరొక కోలాటం వచ్చే ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది.
ఇదే సందర్భంగా కొలువైన VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించి ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా, సుమన్ రాయల కోశాధికారిగా, ఆనంద్ గంధే మరియు మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్ ను ఆహూతులకు పరిచయం చేశారు. ఆ తరువాత సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టి గారిని ‘వాసవి సేవా కుసుమ’గా అభినందిస్తూ చిరు సత్కారంతోపాటు జ్ఞాపికను కార్యనిర్వాహక బృందం ప్రదానం చేసింది. దూర తీరమైన సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యకలాపాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్ గారు మరియు సహవ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి తమ తెలుగునుడితో వ్యవహరించటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం ఇంత సజావుగా నిర్విఘ్నంగా సాగటానికి కేవలం కార్యనిర్వాహక బృందమే కాక అనేక వితరణ శీలులు ఇచ్చిన విరాళాలు మరియు సేవా సభ్యుల సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
_1683095095.jpg)
_1683095150.jpg)
_1683095165.jpg)
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్‌లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్‌కు విశిష్ట గుర్తింపు









