199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్‌

- May 08, 2023 , by Maagulf
199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్‌

ఇస్లామాబాద్‌:  జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను ఈవారం చివరలో విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తమ దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మత్స్యకారులు ప్రస్తుతం ఇక్కడి లాంధీ జైలులో ఉన్నారు.

199 మంది మత్స్యకారులను శుక్రవారం విడుదల చేసి స్వదేశానికి పంపించేందుకు సిద్ధం కావాలని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమకు చెప్పినట్లు సింధ్‌లోని జైళ్ల, దిద్దుబాటు విభాగంలోని ఉన్నత పోలీసు అధికారి కాజీ నజీర్‌ తెలిపారు. ఈ మత్స్యకారులను లాహోర్‌లోని వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

మత్స్యకారులతో స్వదేశానికి తరలించాల్సిన భారతీయ పౌర ఖైదీ జుల్ఫికర్‌ అనారోగ్యం కారణంగా శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించడంతో పాకిస్తాన్‌ అధికారులు సహృద్భావంతో వారిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. భారతీయ ఖైదీ తీవ్ర జ్వరం, ఛాతీ సమస్యల గురించి ఫిర్యాదు చేశాడని, అతని పరిస్థితి గత వారం క్షీణించిందని లాంథీ జైలులోని అధికారులు పేర్కొన్నట్లు కాజీ నజీర్‌ తెలిపారు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అయితే అతను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించాడని అన్నారు. లాంధీ, మలిర్‌ జైళ్లలో పరిస్థితులు బాగా లేవని, జైళ్లలోని పరిస్థితుల కారణంగా ఆరోగ్యం విషమించి జుల్ఫికర్‌ మరణించాడని భారతీయ మత్స్యకారులను లాహోర్‌కు సురక్షితంగా తరలించడానికి, జైళ్లలో ఇతర సహాయాన్ని అందించే ఈధి వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధికారి పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ ఇండియా పీపుల్స్‌ ఫోరమ్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ డెమోక్రసీ ప్రకారం, ప్రస్తుతం 631 మంది భారతీయ మత్స్యకారులు, ఒక పౌర ఖైదీ జైలు శిక్షను పూర్తి చేసినప్పటికీ కరాచీలోని లాంధీ, మలిర్‌ జైళ్లలో ఉన్నారు. గతంలో కూడా కొంతమంది భారతీయ పౌర ఖైదీలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో మరణించారని జైలు అధికారులు తెలిపారు. మొత్తం 654 మంది భారతీయ మత్స్యకారులు కరాచీ జైళ్లలో మగ్గుతుండగా, 83 మంది పాకిస్థానీ మత్స్యకారులు భారతీయ జైళ్లలో ఉన్నట్లు అంచనా. 654 మంది భారతీయ మత్స్యకారులలో 631 మంది శిక్షలు పూర్తి చేసుకుని స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com