సినిమా రివ్యూ: 'కస్టడీ'

- May 12, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: \'కస్టడీ\'

తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మొదట్నుంచీ అంచనాలు రేకెత్తించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఇంటెన్స్ క్రియేట్ చేసింది. అయితే, అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
90ల దశకంలో తెరకెక్కిన చిత్రమిది. గోదావరి ప్రాంతంలోని సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తుంటాడు శివ (అక్కినేని నాగ చైతన్య). అదే సమయంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్టయ్యి జైలుకొస్తాడు రాజు (అరవింద్ స్వామి). రాజును జైల్లోనే చంపించేందుకు సీఎం స్థాయిలో ప్లానింగ్స్ జరుగుతుంటాయ్. అదే ఊరి అమ్మాయి అయిన రేవతి (కృతిశెట్టి)ని శివ ప్రేమిస్తాడు. కులాలు వేరే కావడంతో శివతో పెళ్లికి రేవతి ఇంట్లో ఒప్పుకోరు. వేరే అబ్బాయి (వెన్నెల కిషోర్)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని రేవతి శివతో పారిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో రాజును చంపించేందుకు జరుగుతున్న కుట్ర తెలుసుకున్న శివ, కస్టడీ నుంచి రాజును ఎస్కేప్ చేసి, బెంగుళూరు తీసుకెళ్లిపోతాడు. అసలు ఓ క్రిమినల్‌ని రక్షించేందుకు అంత పెద్ద సాహసం ఎందుకు చేశాడు శివ.? సీఎం స్థాయిలో ఈ కేసుకు సంబంధం ఏంటీ.? చివరికి రాజును కాపాడాడా.? తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా.? తెలియాలంటే ‘కస్టడీ’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఓ సాధారణ కానిస్టేబుల్ తలచుకుంటే ఎంత వరకూ అయినా వెళ్లగలడు.? అనేట్లు తన పాత్రకు చైతూ న్యాయం చేశాడు. చాలా ఇంటెన్స్‌గా కనిపించాడు శివ పాత్రలో. కృతి శెట్టికి గత చిత్రాలతో పోల్చితే కాస్త ప్రాధాన్యత వున్న పాత్రే దక్కింది. కానీ, సరిగ్గా వాడుకున్నట్లు కనిపించలేదు. అరవింద్ స్వామి పాత్ర ఈ సినిమాకి కీలకం. సీరియస్ విలన్ అయినప్పటికీ, తనదైన హ్యూమరస్‌ని పండిస్తూ ఎలివేషన్ సీన్స్‌లో కావల్సినంత ఎలివేట్ అవుతూ ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ తన వంతు నవ్వించే ప్రయత్నం చేశాడు. సీనియర్ నటుడు రాంకీ కామెడీ ధియేటర్లలో విజిల్స్ వేయించింది. ప్రియమణి సీఎం పాత్రలో తనదైన హుందాతనం చూపించింది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేర బాగానే నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
వెంకట్ ప్రభు అంటే విలక్షణ దర్శకుడు. ఆయన నుంచి చాలా చాల ఎక్స్‌పెక్ట్ చేశారు ఆడియన్స్. ఆయన సినిమాల్లో వుండే థ్రిల్లింగ్ అంశాలూ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ‘కస్టడీ’లో పూర్తిగా మిస్ అయ్యిందని చెప్పాలి. మంచి స్టోరీ లైన్ తసీుకున్నప్పటికీ, సాదా సీదా కమర్షియల్ సినిమాగా కథనాన్ని నడిపించేయడం ఆడియన్స్‌ని చాలా నిరాశకు గురి చేస్తుంది. సినిమా నిండా ఛేజ్‌లు, ఎస్కేప్‌లు.. అక్కడక్కడా కామెడీ.. ఓ సాధారణ కమర్షియల్ సినిమాలో వున్నట్లే అనిపిస్తాయ్. వెంకట్ ప్రభు సినిమాల్లో వుండే థ్రిల్లింగ్ మ్యాజిక్స్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించవ్. నెక్స్‌ట్ ఏంటీ.? అనేది ముందే ప్రేక్షకుడి ఊహకు వచ్చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా వంటి దిగ్గజాలు వర్క్ చేసినప్పటికీ మ్యూజిక్ పరంగా కస్టడీ ఫెయిల్యూర్ రిజల్ట్ ఇచ్చింది. ఒక్క పాట కూడా వినసొంపుగా వుండదు. యాక్షన్ సీన్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుందంతే. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌లో చాలా కత్తెరలు పడాల్సి వుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.  

ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య, అరవింద్ స్వామి పర్‌ఫామెన్స్
షార్ప్ స్టోరీ లైన్

మైనస్ పాయింట్స్:
సాదా సీదా కథనం, స్లో నెరేషన్

చివరిగా:
‘కస్టడీ’.. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరాశే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com