సౌదీలో చనిపోయి 55 రోజులైనా ఇంటికి చేరని శవం

- June 22, 2015 , by Maagulf
సౌదీలో చనిపోయి 55 రోజులైనా ఇంటికి చేరని శవం

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చలిగల్ కు చెందిన మసీదు పెద్ద నర్సయ్య ఏప్రిల్ 28 న సౌదీ అరేబియాలో ఒక రోడ్డు ప్రమాదం లో చనిపోయాడు. 55 రోజులు గడిచినా ఇప్పటి వరకు శవం రాలేదు. మృతుని భార్య మసీదు సత్తమ్మ సోమవారం (22.06.2015) హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించింది. తన భర్త శవాన్ని వెంటనే తెప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె తన కుమారుడు వరుణ్ తేజ (2), కూతురు హరిణి (6) ని వెంటబెట్టుకొని వచ్చారు . సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం, డిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై విభాగం, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ను ప్రతివాదులుగా చేర్చుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రవాసి కార్మికుని మృతదేహాన్ని సౌదీ నుండి భారత్ కు తెప్పించడానికి జగిత్యాల ఎమ్మెల్యే  టి.జీవన్ రెడ్డి సంబందిత అధికారులతో మాట్లాడారు. నెలల తరబడి శవాలు గల్ఫ్ లో మగ్గుతుండం పట్ల ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. సౌదీ లోని భారత రాయబార కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ప్రవాసి మృతుని భార్య మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించడానికి సహకరించిన మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి  జనరల్ (డా.) వి కె సింగ్ (రిటైర్డ్) గారు తేది: 4 మార్చి 2015 న  లోక్ సభలో  ప్రకటించిన వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం 54 దేశాలలోని 7086 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. యు ఏ ఇ  లో 2513, సౌదీ అరేబియా లో 2427, ఓమన్ లో 503, ఖతార్ లో 279, బహరేన్ లో 175 మంది భారతీయులు చనిపోయారు.  సౌదీ అరేబియాలోని ఆసుపత్రులలోని శవాగారాలలొ ఇంకా 98  మృత దేహాలు మగ్గుతున్నాయి. 

గల్ఫ్ లో చనిపోయిన ప్రతి ప్రవాసి కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వo రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయము) అందించాలి. 

రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన గల్ఫ్ వలస కార్మికులు ఏడాదికి 400 మంది దాకా వివిధ కారణాలతో విదేశాలలో మరణిస్తున్నారు. వీరిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను తీసుకెళ్ళడానికి ఏర్ కార్గో, శంషాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి మతుల బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం ఏర్ కార్గోలో ఒక హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాల్సి ఉంది. విదేశాల నుండి వచ్చే అన్ని మతదేహాలను ఎయిర్‌పోర్ట్ నుండి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలి. చని పోయిన ప్రవాసీల కు రావలసిన చట్టబద్దమైన బకాయిలు, నష్ట పరిహారాలు పొందుటకు ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలి అని మంద భీంరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

 

"మా గల్ఫ్" ప్రతినిది,(హైదరాబాద్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com