ఎలా ఆపుతారో చూస్తా: పవన్ కల్యాణ్

- June 14, 2023 , by Maagulf
ఎలా ఆపుతారో చూస్తా: పవన్ కల్యాణ్

అమరావతి: పార్టీని పదేళ్లపాటు నడపడం సాధారణ విషయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం, కత్తిపూడిలో ఆయన వారాహి విజయ యాత్ర ప్రారంభించి ప్రసంగించారు. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అంత సులువు కాదని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉంటేనే పార్టీని నడిపించగలమని తెలిపారు.

తాను పార్టీని నడిపించేందుకే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. పాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని చెప్పారు. తాను గొడపెట్టుకునేది వేల కోట్ల రూపాయల డబ్బున్నవారితోనేనని తెలిపారు. యాత్రలు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎలా ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.

సినిమా టిక్కెట్ల విషయంలోనూ..
సినిమా టిక్కెట్లు విషయంలో కూడా దిగజారిన వ్యక్తి వైఎస్ జగన్ అని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆదాయ వనరులను దెబ్బ కొట్టాలి, పార్టీకి ఆర్థిక సహకారం లేకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఏడాది 18సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఓ విన్నపం చేస్తున్నానని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాగా, అంతకుముందు భారీ జనసందోహం మధ్య పవన్ కల్యాణ్ కత్తిపూడికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో ఆయన కత్తిపూడి వచ్చారు. అక్కడ ఇప్పటికే ఉంచిన వారాహిపైకి ఎక్కి యాత్ర, ప్రచారాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రికి ఓ విషయం చెబుతున్నానని, ఛాలెంజ్ చేస్తున్నాను, తనను ఎలా ఆపుతారో చూస్తాననని పవన్ కల్యాణ్ అన్నారు. 151 సీట్లు ఉన్న పార్టీ ఒక్క సీట్ కూడా లేని జనసేన అంటే ఎందుకు భయపడుతుంది అని నిలదీశారు. తమ పార్టీని ఎందుకు అణచి వేయడానికి ప్రయత్నిస్తోంది అన్నారు. అంటే జనసేన బలం వారికి తెలుసని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com