యూఏఈ లో 343 రోడ్డు ప్రమాద మరణాలు నమోదు

- July 20, 2023 , by Maagulf
యూఏఈ లో 343 రోడ్డు ప్రమాద మరణాలు నమోదు

యూఏఈ: యూఏఈ అంతటా 2022లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అయితే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) ఇటీవల విడుదల చేసిన బహిరంగ డేటా ఆధారంగా ప్రమాదాల్లో గాయపడ్డ వారి సంఖ్య, పెద్ద ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య అంతకుముందు ఏడాది కంటే పెరిగాయి.

2022లో రోడ్డు భద్రత గణాంకాలపై MOI నివేదిక విడుదల చేసింది.  గత ఏడాది 343 మరణాలు సంభవించాయి. 2021లో 381 వాహనాల ఢీకొనడం వల్ల సంభవించిన మరణాలతో పోలిస్తే ఇది 10 శాతం తగ్గుదల కావడం గమనార్హం. చివరిసారిగా 2008లో 1,000 కంటే ఎక్కువ మరణాలను ట్రాఫిక్ విభాగం నివేదించింది. ఆ సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా 1,072 మంది మరణించారు. గత 15 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల్లో ఇప్పుడు 68 శాతం తగ్గుదల నమోదైంది.

అయితే, ప్రధాన ట్రాఫిక్ సంఘటనలు, గాయాల బారీన పడ్డ వారి సంఖ్య మొత్తంలో పెరుగుదల నమోదైంది. గత సంవత్సరం,రహదారిపై 5,045 మంది గాయపడ్డారు.2021లో 4,377 మంది గాయాలతో పోలిస్తే 15 శాతం పెరిగింది. పెద్ద ప్రమాదాలు కూడా 13 శాతం పెరిగాయి. 2022లో 3, 945 ప్రమాదాలు చోటుచేసుకోగా.. అంతకుముందు సంవత్సరం 3,488 ప్రమాదాలు నమోదు అయ్యాయి. మరణాలలో 41 శాతం, గాయపడిన వారిలో 53 శాతం మంది 30 ఏళ్లలోపు వారు ఉన్నారు. పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం, ఆకస్మికంగా మారడం, టెయిల్‌గేటింగ్, నిషేధిత పదార్థాల ప్రభావంతో డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు  రోడ్డు ప్రమాదాలలో మొదటి ఐదు కారణాలుగా ఉన్నాయి. మరణాలలో 65 శాతం, మొత్తం గాయపడ్డ వారిలో 57 శాతం ఈ ఐదుకారణాల వల్లేనని నివేదిక తెలిపింది

 2022లో అబుధాబిలో 127 మరణాలు, 1,756 మంది గాయపడ్డారు; దుబాయ్‌లో 120 మరణాలు, 2,161 గాయాలు నమోదయ్యాయి; రాస్ అల్ ఖైమాలో 34 మరణాలు, 411 గాయాలు; షార్జా 33 మరణాలు, 320 గాయాలు; అజ్మాన్13 మరణాలు, 166 గాయాలు; ఉమ్ అల్ క్వైన్ 12 మరణాలు , 46 గాయాలు; ఫుజైరా 4 మరణాలు, 185 గాయాలు నమోదు అయ్యాయి. తేలికపాటి వాహనాలు (66 శాతం), మోటార్‌సైకిల్ (16 శాతం), బస్సులు (ఏడు శాతం), భారీ సరుకు రవాణా వాహనాలు (5 శాతం) ప్రమాదాలకు గురయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com