CBN అరెస్ట్: ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

- September 10, 2023 , by Maagulf
CBN అరెస్ట్: ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌ రెడ్డి వాదిస్తుండగా.. చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడంపై సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలు ఉంటే తప్ప ఈ సెక్షన్‌ వర్తించదని కోర్టుకు వివరించారు. 409 సెక్షన్‌ ను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసు విచారణలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరును తాజాగా చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని అడిగారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన పేరును చేర్చడానికి కారణాలేంటని ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అని ఏఏజీని విచారించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి లాజికల్‌ గా అడిగిన ప్రశ్నలతో సీఐడీ అధికారులతో పాటు ఏఏజీ సుధాకర్‌ రెడ్డి కంగుతిన్నారని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్‌ రెడ్డి జవాబిచ్చారు. వాదోపవాదాలు కొనసాగుతుండగా.. న్యాయమూర్తి కాసేపు బ్రేక్‌ ఇచ్చారు. బ్రేక్‌ తర్వాత ఏఏజీ తన వాదనలు కొనసాగిస్తున్నారు. అనంతరం చంద్రబాబు న్యాయవాది లూథ్రా తన వాదనలు వినిపించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. 

సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి : లూథ్రా

ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్‌ చేసిందని.. స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ అనేది కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్‌ చేసిందని లూత్రా వాదించారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కూడా రిజర్వ్‌ అయ్యింది. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్‌ వచ్చింది అని సిద్ధార్థ లూత్రా స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని..చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్‌ చేశారు అని సిద్ధార్థ లూత్రా కోర్టులో వాదించారు. సీఐడీ ఆరోపిస్తున్నట్లు మాజీ సీఎం నా చంద్రబాబు లండన్‌ వెళ్లడం లేదని న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఏసీబీ కోర్టులో తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేశామని సీఐడీ చెబుతోందని, ముందురోజు రాత్రి 11 గంటలకే ఆయనను సీఐడీ పోలీసులు చుట్టుముట్టారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని కోరారు.

పోలీసులు భారీ బందోబస్తు

చంద్రబాబు విచారణ సందర్భంగా కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. వాదనలు ముగింపు దశకు చేరుకోడవడంతో న్యాయమూర్తి నిర్ణయం ఎలా వుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసి కోర్టు తీర్పు వెలువడే అవకాశం వుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో భారీగా పోలీసులను మొహరించారు. ఏసీబీ కోర్టు ప్రాంగణంనుండి మీడియా సభ్యులు, పార్టీల నాయకులను పోలీసులు పంపిస్తున్నారు. టిడిపి ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com