కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..

- September 19, 2023 , by Maagulf
కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..

వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ప్రతీయేటా ఖైరతాబాద్ గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ కొలువుదీరే భారీ గణపతిని దర్శించుకొనేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. ప్రతీయేటా అనేక ప్రత్యేకతలతో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను దర్శనమిస్తారు. చరిత్రలోనే తొలిసారి 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ఈసారి ప్రతిష్టించారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శమిస్తున్నారు. ఈసారి 63అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సరస్వతీ, వారాహీ మాతలతో శ్రీదశ మహా విద్యాగణపతి దశ హస్తాలతో కొలువు దీరారు.

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ప్రతీయేటా సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మరింత సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాగణపతికి నలుదిక్కులా 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇద్దరు ఏసీపీలు, సీఐల పర్యవేక్షణలో 300 మంది పోలీసుల సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. గణపతిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకోసం బారికేడ్లతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఐమాక్స్ మీదుగా వచ్చేవారు గజ్జెలమ్మ దేవాలయం గల్లీ నుంచి వార్డు ఆఫీసు మీదుగా, సెన్షేషన్ థియేటర్, రైల్వే గేటు మార్గం ద్వారా వచ్చి మహాగణపతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. వారు దర్శనం అనంతరం తిరిగి మింట్ కాంపౌండ్ రూట్ లో వెళ్లేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్థానిక భక్తుల కోసం వెనుక వైపు దారి ఉంచారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు పోలీసులతోపాటు వలంటీర్లు సహాయపడనున్నారు.

ఈ మట్టి గణపతిని తయారు చేసేందుకు 150 మంది కళాకారులు దాదాపు 100 రోజులు శ్రమించారు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరభద్రుడిని పూజించడం వల్ల ధైర్యం వస్తుంది. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వరిగడ్డి, వరిపొట్టు, ఇసుక, వైట్ క్లాత్ ఇవన్నీ విగ్రహ తయారీలో ఉపయోగించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహ తయారీకి సుమారు 90లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com