30 ఏళ్లలోపు వారిలో పెరుగుతున్న గుండెపోటులు..!

- September 19, 2023 , by Maagulf
30 ఏళ్లలోపు వారిలో పెరుగుతున్న గుండెపోటులు..!

యూఏఈ: ఇటీవలి కాలంలో యువకులలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాల కంటే ఈ ప్రాంతంలోని ప్రజలలో ప్రీమెచ్యూర్ కరోనరీ హార్ట్ డిసీజెస్ (CHDలు) ముందుగానే వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఎమిరేట్స్ కార్డియాక్ సొసైటీ (ఈసీఎస్) ప్రెసిడెంట్ డాక్టర్ జువైరియా అల్ అలీ కొన్నేళ్ల క్రితం మాట్లాడుతూ.. 50 ఏళ్లలోపు రోగులు గుండెపోటుతో బాధపడటం చాలా అరుదు అని అన్నారు. యూఏఈ అంతటా ఉన్న ఆసుపత్రులు గుండెపోటు కారణంగా 30 ఏళ్ల ప్రారంభంలో చేరిన వారి సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించారు. యూఏఈలో గుండెపోటుకు దారితీసే కరోనరీ హార్ట్ డిసీజ్‌ల కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు పరిశోధనలో తేలింది. పాశ్చాత్య దేశాల ప్రజల కంటే 10-15 సంవత్సరాల ముందుగానే యూఏఈలో యువకులు గుండెపోటు బారీన పడుతున్నారని నివేదిక తేల్చిందని డాక్టర్ జువైరియా చెప్పారు. ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకారం..యూఏఈలో గత రెండు సంవత్సరాల్లో గుండె జబ్బుల మరణాల రేటు 100,000కి 70-80గా ఉంది.

ఇదిలా ఉండగా.. యూఏఈలో దాదాపు 40 శాతం మంది పెద్దలు అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ (ASCVD) బారిన పడే ప్రమాదం ఉందని, ఇంకా చాలా మందికి గుండెపోటు లేదా గుండెపోటు వంటి తీవ్రమైన పరిస్థితులను అనుభవించే వరకు ప్రమాదం గురించి తెలియదని డాక్టర్ జువైరియా అభిప్రాయపడ్డారు.   నివాసితులలో సగానికి పైగా వారి జీవితకాలంలో గుండె జబ్బులతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించిందని డాక్టర్ జువైరియా వెల్లడించారు.  

గుండెపోటు లక్షణాలు
గుండెపోటు ప్రారంభ సంకేతాలలో కొంచెం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దవడ, మెడ, వీపు, చేయి లేదా భుజం ప్రాంతంలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటాయి. వీటితో పాటు వ్యక్తి వికారంగా అనిపించవచ్చు. కాగా, కొంతమంది గుండెపోటుకు ఒక నెల ముందునుంచి వారి శరీరంలో మార్పులను గమనించవచ్చు. చాలా మంది రోగులు తమకు అనుభవం అయిందని చెప్పారు. ఛాతీలో అసౌకర్యం ఉంటుందని, కానీ దానిని గుండెల్లో మంటగా తప్పుగా భావించి నిర్లక్ష్యం చేశామని తెలిపారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఛాతీలో డీప్ పెయిన్ చాలా నిమిషాల పాటు కొనసాగుతుందని డాక్టర్ జువైరియా తెలిపారు. విపరీతమైన చెమటలు పడతాయి. అయితే, కొందరిలో ఈ లక్షణాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్న వ్యక్తులు లక్షణాలను అస్సలు అనుభవించకపోవచ్చని డాక్టర్లు తెలిపారు.  

ప్రమాదాలను ఎలా తగ్గించాలి?
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఒత్తిడిని మేనేజ్ చేయడం వంటి మంచి ఆరోగ్య విధానలు గుండె ఆరోగ్యానికి దోహదపడే జీవనశైలిగా డాక్టర్లు చెబుతున్నారు.చాలా మంది వైద్యులు గుండె జబ్బులను నివారించడానికి వారానికి 150 నిమిషాల కంటే ఎక్కువ వ్యాయామం చేయాలని కూడా సిఫార్సు చేస్తున్నారు.దీంతోపాటు  ప్రజలు గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చర్మం లేని పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, ఉప్పు లేని గింజలు, చిక్కుళ్ళు పుష్కలంగా తమ ఆహారంలో చేర్చుకోవాలని  డాక్టర్లు సూచించారు.  ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ నేపథ్యం ఉన్నవారు తరచుగా కొలెస్ట్రాల్‌ను చెక్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com