సినిమా రివ్యూ: ‘MAD’

- October 06, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘MAD’

చిన్న సినిమానే అయినా బాగా ప్రమోట్ చేశారు ఈ సినిమాని. నిజానికి ‘మామా మశ్చీంద్ర’, ‘రూల్స్ రంజన్’ తదితర సినిమాలు రిలీజ్ అయ్యాయ్ ఈ వారం. వాటన్నింట్లోకెల్లా ‘మ్యాడ్’ చిత్రం అందర్నీ విశేషంగా ఆకర్షించింది.
అంతలా ఆకర్షించేందుకు ‘మ్యాడ్’లో ఏముంది.? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధుల కథే ఈ మ్యాడ్ చిత్రం. ముగ్గురు హీరోల పేర్లలోని మొదటి అక్షరాన్ని టైటిల్‌గా పెట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్) రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరికి లడ్డు (విష్ణు) పరిచయమవుతాడు. వీరిలో అశోక్ కాస్త కామ్‌గా వుంటాడు. మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయినీ ప్రేమలో పడేయాలనుకుంటాడు. డీడీ తనకసలు అమ్మాయిలే సెట్ కారని దూరంగా వుంటుంటాడు. అయితే, మనోజ్ తాను రోజూ బస్సులో చూసే అమ్మాయిని ఇష్టపడతాడు. అశోక్‌ని అదే కాలేజ్‌కి చెందిన జెన్నీ లవ్ చేస్తుంటుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి డైలీ ఫోన్ కాల్ వస్తుంటుంది. అది ఓ అమ్మాయిదని తెలిసి నాలుగేళ్లూ అదే అమ్మాయిని చూడకుండానే లవ్ చేస్తుంటాడు. లడ్డూకి ఓ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇలా హాయిగా సాగే ఈ నలుగురు కుర్రాళ్ల జీవితం భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంది. ఇంతే హాయిగా సాగిపోయిందా.? అనేది తెలియాలంటే ‘మ్యాడ్’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
కాలేజీ క్యాంపస్ నేపథ్యంలో సాగే కథలకు యూత్ నుంచి మంచి క్రేజ్ వుంటుంది. అలాగే ఈ కథకూ మంచి ఆదరణ దక్కింది. నటీనటులు కొత్తవాళ్లే అయినా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమా అయినా చక్కటి నటనా ప్రతిభను చాటుకున్నాడు. సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ టాలెంట్ ఆల్రెడీ తెలిసిందే. రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. మరో నటుడు నితిన్ రామ్ కూడా తన పాత్ర పరిధి మేర బాగా నటించాడు. హీరోయిన్లు ముగ్గురూ తమదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. చెప్పాలంటే, ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రాధాన్యత దక్కించుకున్నదే. లడ్డు పాత్రలో నటించిన కుర్రాడు తనదైన కామెడీ టైమింగ్‌తో పాటూ, అవసరమైన చోట టాలెంట్ చూపించాడు.

సాంకేతిక వర్గం పని తీరు:
ఇలాంటి కథలకు కథలో విషయం ఏమీ లేకున్నా.. కథనం నడిపే తీరులో గ్రిప్పింగ్ వుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అదే ‘మ్యాడ్’కి ప్లస్ అయ్యింది. ‘హ్యాపీ డేస్’, ‘కేరింత’, ‘కిర్రాక్ పార్టీ’ తదితర సినిమాలను తలపుకు తెచ్చింది. ఆధ్యంతం నడిచిన కామెడీ ‘జాతిరత్నాలు’ సినిమాతో పోల్చేలా చేసింది. హారిక సూర్యదేవర ఈ సినిమాతో నిర్మాతగా తొలి ప్రయత్నం చేశారు. విజయం సాధించారనే చెప్పొచ్చు. అలాగే, దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్‌కి వంకలు పెట్టడానికి లేదు. సినిమా ఎక్కడా బోర్ కొట్టించదు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్ ఓకే. కానీ, పాటలపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. ఇక, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తాను రాసుకున్న స్క్రిప్ట్‌ని అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో విజయం సాధించాడు. కథ ఏంటీ.? అనేది పక్కన పెడితే, యూత్‌కి కావల్సిన కథనంతో సినిమాని మొదటి నుంచి, చివరి వరకూ కాన్ఫిడెంట్‌గా నడిపించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పర్‌పామెన్స్, ఆధ్యంతం నవ్వించిన కామెడీ సీన్లు.. ఆకట్టుకుంటూనే ఆలోచింపచేసిన డైలాగులు..

మైనస్ పాయింట్స్:
కథా బలం లేకపోవడం.. పాటలు,

చివరిగా:
‘మ్యాడ్’ చిన్న సినిమానే అయినా పెద్ద విజయం అందుకోదగ్గ కంప్లీట్ యూత్ ఎంటర్‌టైనర్..!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com