దుబాయ్ లో సందడిగా జరిగిన 'దసరా-దీపావళి' ఈవెంట్

- November 08, 2023 , by Maagulf
దుబాయ్ లో సందడిగా జరిగిన \'దసరా-దీపావళి\' ఈవెంట్

దుబాయ్: దసరా, దీపావళి పండుగలు అంటే సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇక విదేశీ గడ్డపై ఈ సంబరాలంటే ఆ లెక్కే వేరు. మనవారందరు ఒక చోట చేరి ఎంతో ఉల్లాసంతో ఆ సంబరాల్లో పాల్గొంటారు. 

ఇక అతివలు సాంప్రదాయ దుస్తులైన చీరకట్టులో చేసే సందడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చక్కనమ్మ చీర కడితే పండక్కి ఇంకా అందం చేకూరుతుంది అన్నట్టు దుబాయ్ లో ఉంటున్న వనితలు వివిధ రకాల చీరలను విభిన్న స్టైల్స్ లో కట్టి పండుగను జరుపుకోవటం జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

'దుబాయ్ శారీ సఖి'స్ అనే గ్రూప్ నిర్వాహకులు లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో 'దసరా - దివాళి' అనే ఈవెంట్ దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ లో రంగ రంగ వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం తొలుత దీప ప్రజ్వలనతో మొదలై.. ఆట పాటలతో ట్రెడిషనల్ మరియు మోడెర్న్ చీర కట్టుల్లో ఫ్యాషన్ షో లతో ఎంతో ఉల్లాసంగా సాగింది. 

ఈ కార్యక్రమానికి ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ సుమ అతిధిగా హాజయ్యారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. తదుపరి అందరు బతుకమ్మ సంబరాలు కూడా జరుపుకోవటం విశేషం. దసరా సందర్భంగా దుబాయ్ లో వైవిధ్యంగా పేర్చిన బొమ్మల కొలువులకు బహుమతులు అందించి కళలను మరియు సంప్రదాయాలను ప్రోత్సహించటం జరిగింది.

'దుబాయ్ శారీ సఖి'స్ గ్రూప్ నిర్వాహకులు, ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సుర్ లక్ష్మి రెడ్డి మాట్లాడుతూ.."నాకు చీర అంటే ప్రత్యేక అభిమానం. నా అభిరుచికి తగ్గట్టుగా ఈ గ్రూప్ ను స్టార్ట్ చేసాను. నా అభిరుచికి ఎందరో తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఈ గ్రూప్ ను ప్రోత్సహించటం నాకు ఆనందాన్నిస్తోంది. చీరలను అభిమానించే ఎందరో మాతో కలవటం నూతన ఉత్సాహాన్నిస్తోంది. ఈరోజు వివిధ పోటీల్లో బహుమతులు గెలిచిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు" అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com