ఉక్రెయిన్‌ పై విరుచుకుపడ్డ రష్యా..

- November 25, 2023 , by Maagulf
ఉక్రెయిన్‌ పై విరుచుకుపడ్డ రష్యా..

రష్యా: ఉక్రెయిన్‌ పై మరోసారి రష్యా మెరుపుదాడికి దిగింది. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. అయితే రష్యా డ్రోన్‌ దాడులను తిప్పికొట్టామని, కాని కొన్ని భవనాలు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య తరువాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని ఉక్రెయిన్‌ బలగాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ పై ఒకేసారి 75 డ్రోన్లు ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ డ్రోన్‌ దాడులు జరిగాయి. 75 ఇరానీయన్‌ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ అధికారులు చెప్పారు. కీవ్‌ తోపాటు సుమీ, ద్నిప్రోపెట్రోవ్స్క్, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రోన్‌ దాడులు జరిపాయి. కీవ్‌పైకి ప్రయోగించిన 60కిపైగా డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు నగర పాలనాయంత్రాంగం తెలిపింది.

శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 వరకు ఈ డ్రోన్ల దాడి జరిగినట్టు అధికారులు చెప్పారు. దాడుల్లో 77 నివాస భవనాలు, 120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొన్నారు. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్‌ష్కి చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

1932- 33లో ఉక్రెయిన్‌లో లక్షలాది మంది మరణానికి కారణమైన కరవు విషాదాన్ని గుర్తుచేసుకునే ‘హోలోదోమోర్ సంస్మరణ దినం’ రోజునే ఈ దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన చాలా డ్రోన్లను కూల్చేశామని , కూల్చివేశారు. కానీ, కొన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గగనతల రక్షణను మరింత పటిష్ఠం చేసి, మరిన్ని లక్ష్యాలను నేలకూల్చుతామని చెప్పారు. అంతకుముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్‌ సైతం డ్రోన్లతో దాడి చేసింది. గత 21 నెలల్లో ఉక్రెయిన్‌ చేపట్టిన అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో ఇదొకటని మాస్కో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com