గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్..యశోదలో చేరిక

- December 08, 2023 , by Maagulf
గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్..యశోదలో చేరిక

హైదరాబాద్: మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..గురువారం అర్ధరాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు సోమాజిగూడ లోని యశోద హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

కాగా, విషయం గురించి తెలియగానే కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం ఫై కవిత ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇచ్చింది. కేసీఆర్ గారికి స్వల్ప గాయమైందని..త్వరలోనే ఆయన కోలుకొని మనముందుకు వస్తారని తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్‌ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు, పార్టీ నాయకులు ఆయనతో సమావేశమవుతున్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇస్తున్నారు.

గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహంతో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు. అభిమాన నేతతో సెల్ఫీలు తీసుకున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు ప్రజలతో కేసీఆర్ మాట్లాడారు. ఓపికతో అందర్నీ పలకరించారు. తాము కేసీఆర్ ను ఇంకా సీఎం గానే భావిస్తున్నట్టు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com