COP-28 సమావేశం: వేదిక పై భారతీయ బాలిక నిరసన

- December 12, 2023 , by Maagulf
COP-28 సమావేశం: వేదిక పై భారతీయ బాలిక నిరసన

దుబాయ్‌: దుబాయ్‌ లో జరుగుత్నున కాప్‌-28 సమావేశాల్లో మంగళవారం కలకలం చెలరేగింది. భారత దేశంలోని మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్‌ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి చేరి పెట్రోలు, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది.ఈ క్రమంలో వేదికపై ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపింది.

అయితే, లిసిప్రియా కాన్‌గుజమ్‌ శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తోంది. కాగా, శిలాజ ఇంధనాల విచ్చల విడి వాడకం కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం ఫలితంగా భవిష్యత్తులో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేసుకంటాయని, సముద్రమట్టాలు పెరిగిపోయి తీరప్రాంతాల్లోని ముంబై వంటి నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టం చేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలంటూ లిసిప్రియ నినదించారు. చర్చలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లిసిప్రియ వినలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా అందరికీ వివరించింది. చివరకు ఇద్దరు భద్రత సిబ్బంది లిసిప్రియను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు. అయితే, చర్చల్లో పాల్గొన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్థిస్తూ చప్పట్లతో అభినందించారు. నిర్వాహకులు కూడా లిసిప్రియ చర్యను తప్పు పట్టకపోగా.. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని.. ఆమె చర్యను కొనియాడటం కొసమెరుపు!.

అలాగే తన నిరసన అనంతరం లిసిప్రియా ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'నేను నిరసన తెలియజేయడంతో వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే.. నాకు మద్దతు ఇవ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఐరాస వద్ద నా గళాన్ని వినిపించే హక్కు ఉంది' అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com